న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్ తగిలింది. అధికారంలో ఉన్న ఆ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు శుక్రవారం రాజీనామా చేశారు. (AAP MLAs Resigned) అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు పార్టీపై తమకు నమ్మకం పోయిందని ఆయనకు రాసిన లేఖలో ఆరోపించారు. ఎమ్మెల్యేలు నరేష్ యాదవ్ (మెహ్రౌలి), రోహిత్ కుమార్ (త్రిలోక్‌పురి), రాజేష్ రిషి (జనక్‌పురి), మదన్ లాల్ (కస్తూర్బా నగర్), పవన్ శర్మ (ఆదర్శ్ నగర్), భావన గౌడ్ (పాలం), బీఎస్ జూన్ (బిజ్వాసన్) ఆప్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను అరవింద్ కేజ్రీవాల్‌కు పంపారు.
కాగా, అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు ఆప్‌పై నమ్మకం కోల్పోయినందున పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పాలం ఎమ్మెల్యే భావన గౌడ్, కస్తూర్బా నగర్ శాసనసభ్యుడు మదన్ లాల్ ఆరోపించారు. అయితే రాజీనామా చేసిన ఈ ఏడుగురు ఎమ్మెల్యేలకు టిక్కెట్లను ఆప్ నిరాకరించింది. దీంతో ఎన్నికల పోటీలో లేని ఈ ఏడుగురు ఎమ్మెల్యేలు శుక్రవారం రాజీనామా చేశారు. అయితే వారు ఏ పార్టీలో చేరుతారో అన్నది స్పష్టం కాలేదు.
మరోవైపు 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న పోలింగ్ జరుగనున్నది. ఫిబ్రవరి 8న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు.