బెంగళూరు: కర్ణాటకలోని దావనగెరెలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున దావనగెరె సమీపంలో కారు డివైడర్ను ఢీకొట్టింది. దీంతో ఏడుగురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్న ఏడుగురు కారులో తమ స్వస్థలాలకు బయలుదేరారు.
ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 4 గంటల సమయంలో దావనగెరె సమీపంలోని జగలూరు వద్ద అదుపుతప్పిన కారు డివైడర్ను ఢీకొట్టింది. దీంతో ఏడుగురు దుర్మరణం చెందారు. ప్రమాదం దాటికి కారు నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో నుంచి మృతదేహాలను కష్టంగా వెలికితీసి దవాఖానకు తరలించారు.
మృతులంతా కర్ణాటకలోని యాద్గిర్, విజయపురా, విజయనగర్ జిల్లాలకు చెందినవారని చెప్పారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని వెల్లడించారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువకులంతా 18 నుంచి 22 ఏండ్లలోపువారే కావడం గమనార్హం.