Dam Breach | మధ్యప్రదేశ్‌లో ఒక డ్యామ్ లీక్ కేసులో ఏడుగురు ఇంజినీర్లు, ఒక అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. ధార్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న కరం డ్యామ్ ఇటీవల లీక్ అయ్యింది. ఈ నెల 11న డ్యామ్‌లో పగుళ్లు వచ్చాయి. ఫలితంగా వరదలు పోటెత్తుతాయన్న భయంతో 18 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నీటిని మళ్లించడానికి అత్యవసర కాలువలు తవ్వించింది సర్కార్. గ్రామాలపై వరద పోటెత్తకుండా నివారించగలిగారు గానీ.. డ్యామ్ మాత్రం కొట్టుకుపోయింది.
విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ జల వనరుల శాఖకు చెందిన ఏడుగురు ఇంజినీర్లు, ఒక సబ్ డివిజనల్ అధికారికి సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ వేటుకు గురైన వారిలో చీఫ్ ఇంజినర్ సీఎస్ ఘాటోల్, సూపరింటెండెంట్ ఇంజినీర్ పీ జోషి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బీఎల్ నినామా, అసిస్టెంట్ ఇంజినీర్ వాకర్ అహ్మద్ సిద్దిఖీ, సబ్ ఇంజినీర్లు అశోక్ కుమార్, విజయ్ కుమార్ జాథాప్, దశాబందా సిసోడియా, ఆర్కే శ్రీవాత్సవ ఉన్నారు.
కరం డ్యామ్ లీక్ ఘటనలో ఇంజినీర్లు, అధికారి నిందితులని దర్యాప్తు కమిటీ నిగ్గు తేల్చినా.. వారిపై ఎందుకు చర్య తీసుకోలేదని మధ్యప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ ప్రశ్నించారు. రూ.113 కోట్ల విలువ గల ఈ డ్యామ్ 2018లో ప్రారంభించారు. తొలిసారి ట్రయల్స్ ఈ నెల 11న చేపట్టారు. వరదలు పోటెత్తడంతోపాటు డ్యామ్ నిర్మాణంలో అవకతవకల వల్ల అది కొట్టుకుపోయింది.