డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో వరుస హెలికాప్టర్ ప్రమాదాలు యాత్రికుల ప్రాణాలను గాల్లో దీపాలను చేస్తున్నాయి! తాజాగా గౌరీకుండ్ అటవీ ప్రాంతంలో ఆదివారం ఉదయం ఓ ప్రైవేట్ హెలికాప్టర్ కూలిపోవడంతో పైలట్ సహా అందులోని ఆరుగురు ప్రయాణికులు దుర్మరణం చెందారు. కేదార్నాథ్ ధామ్ నుంచి గుప్త్ కాశీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కేవలం ఆరు వారాల వ్యవధిలో రాష్ట్రంలో ఈ తరహా హెలికాప్టర్ ప్రమాదం జరగడం ఇది అయిదోసారి కావడం ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తున్నది.
ఉదయం 5.19 నిమిషాలకు బయల్దేరినప్పుడు లోయలో తీవ్ర ప్రతికూల వాతావరణం ఉండటం వల్ల హెలికాప్టర్ ప్రయాణ దిశ నుంచి పక్కకు తప్పినట్టు తెలుస్తున్నది. దృష్టి గోచరత్వం సరిగా లేపోవడం, కఠిన వాతావరణం ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అధికారులు నిర్ధారించారు. ప్రమాద నేపథ్యంలో చార్ధామ్ ప్రాంతంలో రెండు రోజుల పాటు హెలికాప్టర్ సర్వీసులను సస్పెండ్ చేశారు. హెలికాప్టర్ ఆపరేషన్స్ కోసం కఠినమైన ప్రామాణిక నిర్వహణ విధానాలను(ఎస్వోపీ) రూపొందించాలని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అధికారులను ఆదేశించారు.
బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లో గగనతల ప్రయాణ సేవల నిబంధనలను ప్రైవేట్ ఏవియేషన్ కంపెనీలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి. గత ఆరు వారాల్లో అయిదు హెలికాప్టర్ ప్రమాదాలు జరిగినా ప్రభుత్వం ఇప్పటి వరకు కఠిన చర్యలు, మార్గదర్శకాలు విడుదల చేయకపోవడంపై విపక్షాలు, సామాజిక కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బు సంపాదనలో పడి హెలి కంపెనీలు నిబంధనలను గాల్లోకి వదిలేస్తున్నాయని.. ప్రభుత్వానికి వాటిపై నియంత్రణ లేని విషయాన్ని వరుస ప్రమాదాలు సూచిస్తున్నాయని రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సూర్యకాంత్ విమర్శించారు.