బెంగళూరు: పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు వెంటనే ఆయా స్కూళ్లకు వెళ్లారు. బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో శుక్రవారం ఈ ఘటన జరిగింది. నగరంలోని సుమారు ఏడు పాఠశాలలకు ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చినట్లు బెంగళూరు నగర పోలీసు కమిషనర్ కమల్ పంత్ తెలిపారు. మహదేవపురలోని ఒపలన్ ఇంటర్నేషనల్ స్కూల్, వర్తుర్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, హెన్నూర్‌లోని న్యూ అకాడమీ స్కూల్, సెయింట్ విన్సెంట్ పాల్ స్కూల్, గోవింద్పురాలోని ఇండియన్ పబ్లిక్ స్కూల్‌కు ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయని చెప్పారు. దీంతో ఆయా స్కూళ్లకు పోలీస్ బృందాలు వెళ్లాయని, బాంబు స్క్వాడ్‌తో సోదాలు చేసినట్లు వివరించారు.
కాగా, శుక్రవారం ఉదయం 11 నుండి 11.10 గంటల మధ్య ఆయా స్కూళ్లకు ఈ మెయిల్స్ వచ్చినట్లు కొన్ని వర్గాలు తెలిపాయి. ‘మీ పాఠశాలలో చాలా శక్తివంతమైన బాంబు ఉంది. అప్రమత్తమవ్వండి. ఇది జోక్ కాదు. చాలా శక్తివంతమైన బాంబు మీ స్కూల్లో అమర్చారు. వెంటనే పోలీసులు, బాంబు స్క్వాడ్లను పిలవండి. లేకపోతే మీతో సహా వందలాది జీవితాలు బలవుతాయి. ఆలస్యం చేయవద్దు. ఇప్పుడు ప్రతిదీ మీ చేతుల్లోనే ఉంది’ అని అందులో ఉన్నట్లు వెల్లడించాయి.
మరోవైపు ఈ మెయిల్స్ అమెరికా నుంచి వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పరీక్షలు జరుగుతుండటంతో ఈ మేరకు ఆకతాయి బెదిరింపు మెయిల్స్ పంపి ఉంటారని భావిస్తున్నారు. అయినప్పటికీ ఆయా స్కూళ్లకు పోలీసులు, బాంబు స్క్వాడ్లు వెళ్లాయని, విద్యార్థులను ఖాళీ చేయించి సోదాలు నిర్వహించినట్లు పోలీస్ అధికారులు వివరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.
కాగా, కర్ణాటకలో ఇటీవల పలు అంశాలపై వివాదం చెలరేగుతున్నది. బీజేపీ అధికారంలో ఉన్న ఆ రాష్ట్రంలో హిజాబ్ వివాదంతో స్కూళ్లు, కాలేజీలు కొన్ని రోజులు మూతపడ్డాయి. తాజాగా ఏడు స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడం కలలకం రేపింది.