(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్-సర్) దేశవ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతున్నది. అక్రమ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా ఎన్నికల సంఘం (ఈసీ) సర్‌ను చేపట్టింది. తొలి దఫాలో బీహార్, రెండో దఫాలో భాగంగా మరో 12 రాష్ర్టాలు, యూటీల్లో సర్ ప్రక్రియ పూర్తైంది. ఈ రెండు దఫాల్లో 7.85 కోట్ల ఓటర్లను తొలగించినట్టు ఈసీ వర్గాలు వెల్లడించాయి. అయితే, బీజేపీకి రాజకీయంగా ఇబ్బందికరంగా కనిపించే ప్రాంతాల్లోనే ఓట్ల తొలగింపు ఎక్కువగా జరుగుతున్నట్టు ఇండియా కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.
నిరుడు బీహార్‌లో, ఇటీవల 12 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో (యూటీ) సర్ ప్రక్రియను పూర్తి చేశారు. బీహార్‌లో 65 లక్షల ఓటర్లను తొలగించగా.. రెండో దఫాలోని మిగతా రాష్ర్టాల్లో మరో 7.2 కోట్ల మంది ఓటర్లను తొలగించారు. దీంతో సర్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ తొలగించిన ఓటర్ల సంఖ్య 7.85 కోట్లకు చేరింది. ఆయా రాష్ర్టాల్లో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్యతో పోలిస్తే, ఇది 10 శాతం కంటే ఎక్కువగా ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అత్యధికంగా యూపీలో 2.04 కోట్ల ఓట్లను (13.21 శాతం) తొలగించగా, బెంగాల్లో 95 లక్షల ఓట్లను (10.9 శాతం) తొలగించారు. ఇక, ‘సర్’ ప్రక్రియలో భాగంగా దాదాపు 2.21 కోట్ల మంది ఓటర్లు కొత్తగా చేరినట్టు ఈసీ తెలిపింది. 18 ఏండ్లు నిండిన వారందరికీ ఓటు హక్కును కల్పిస్తున్నట్టు వెల్లడించింది.
