న్యూఢిల్లీ, నవంబర్ 27: దేశంలోని డ్రగ్ నిఘా సంస్థలు 2023లో 7 లక్షల కిలోలకు పైగా మాదకద్రవ్యాలను ధ్వంసం చేసినట్టు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ వెల్లడించారు. బుధవారం ఆయన రాజ్యసభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. 2019తో పోలిస్తే 2023లో మూడు రెట్లు అధికంగా మాదకద్రవ్యాలను, మస్తిష్కంపై ప్రభావం చూపే మత్తు మందులను ధ్వంసం చేసినట్టు చెప్పారు. 2019లో 1,55,929 కిలోలు, 2023లో 7,62,015 కిలోల మాదకద్రవ్యాలు ధ్వంసం చేశామన్నారు. ఇది 388 శాతం అధికమని చెప్పారు. ఇలా ధ్వంసం చేసిన పదార్థాలలో మాత్రలు, ఇంజక్షన్లు, యాంపిల్స్, దగ్గు సిరప్లు కూడా ఉన్నాయని చెప్పారు.