Uttarkashi | దేవభూమి ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని ఉత్తరకాశీ (Uttarkashi)లో జల విలయం బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. పవిత్ర చార్ధామ్లలో ఒకటైన గంగోత్రికి వెళ్లే మార్గంలోని ధరాలి (Dharali) గ్రామంపై మంగళవారం ఆకస్మిక వరదలు విరుచుకుపడ్డాయి. కుంభవృష్టి కారణంగా వచ్చిన మెరుపు వరదలకు కొండచరియలు విరిగిపడి ఇళ్లు, హోటళ్లు, కార్లు కొట్టుకుపోయాయి. ఈ విలయంలో ఇప్పటి వరకూ ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే, జలప్రళయాన్ని చవిచూసిన ధరాలి ప్రాంతంలో వరుసగా మూడోరోజు గురువారం కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
వరద ప్రభావిత ప్రాంతంలో చిక్కుకుపోయిన దాదాపు 65 మందిని హెలికాప్టర్ ద్వారా సురక్షిత ప్రాంతానికి తరలించారు. అయితే, ఈ విపత్తులో ఎంతమంది తప్పిపోయారనేదానిపై స్పష్టత లేదు. శిథిలాల కింద వందలాది మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. చినూక్ హెలికాప్టర్లు, హెవీ-లిఫ్ట్ టెన్డం రోటర్ విమానం, Mi-17 ఛాపర్ల ద్వారా వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ప్రతికూల వాతావరణ పరిస్థితులు సహాయక చర్యలకు (Rescue operations) సవాల్‌గా మారాయి. భారీ వర్షాలు, విరిగిపడుతున్న కొండ చరియల కారణంగా ధరాలీకి వెళ్లే రోడ్లన్నీ మూసుకుపోయాయి. దీంతో అక్కడ అనేక మంది టూరిస్ట్‌లు పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. గంగోత్రి, ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన దాదాపు 274 మంది పర్యాటకులను రెస్క్యూ టీమ్ ఉత్తరకాశీ, డెహ్రాడూన్‌కు తరలిస్తోంది. అందులో 131 మంది గుజరాత్ వాసులు కాగా, 123 మంది మహారాష్ట్రకు చెందిన టూరిస్ట్‌లు.
Also Read..
Yamuna River | డేంజర్ మార్క్‌ను దాటిన యమునా నది ప్రవాహం.. ఆందోళనలో ఢిల్లీ వాసులు
CRPF | ప్రమాదానికి గురైన సీఆర్పీఎఫ్ జవాన్ల వాహనం.. ముగ్గురు మృతి