అగర్తల: ఇద్దరు కొడుకులు దారుణానికి పాల్పడ్డారు. వృద్ధురాలైన కన్న తల్లిని చెట్టుకు కట్టేశారు. ఆమెకు నిప్పంటించి సజీవంగా దహనం చేశారు. (Sons Burnt Alive Mother) ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. త్రిపురలోని చంపక్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. ఖమర్బారిలో నివసించే ఇద్దరు వ్యక్తులు శనివారం రాత్రి 62 ఏళ్ల వృద్ధురాలైన తల్లిని చెట్టుకు కట్టేశారు. ఆమెకు నిప్పంటించడంతో సజీవంగా కాలి మరణించింది.
కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సజీవ దహనమైన వృద్ధురాలి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణానికి పాల్పడిన ఆమె ఇద్దరు కుమారులను అరెస్ట్ చేశారు.
మరోవైపు ఏడాదిన్నర కిందట భర్తను కోల్పోయిన ఆ మహిళ తన ఇద్దరు కుమారులతో కలిసి జీవిస్తున్నదని పోలీసులు తెలిపారు. ఆమె మరో కుమారుడు అగర్తలాలో ఉంటున్నట్లు చెప్పారు. వృద్ధురాలి దారుణ హత్యకు కుటుంబ కలహాలు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.