హరిద్వార్, జూలై 27 : ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆదివారం ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 8మంది భక్తులు మరణించగా, 25 మందికి పైగా గాయపడ్డారు. పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో మెట్ల మార్గంలో గందరగోళం ఏర్పడి తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ సందర్భంగా అక్కడ విద్యుత్తు షాక్‌కు కొందరు గాయపడినట్టు భక్తులు తెలిపారు. ఆలయానికి సమీపంలోని ఒక విద్యుత్తు స్తంభం నుంచి కరెంట్ ప్రసారం అయ్యిందని, దానికి తగిలి కొందరు విద్యుదాఘాతానికి గురయ్యారని, దీంతో భయాందోళనతో భక్తులు పెద్దపెట్టున అరవడంతో గందరగోళం ఏర్పడి తొక్కిసలాటకు దారి తీసిందని చెప్పారు.
అయితే దీనిని పోలీసులు తోసిపుచ్చారు. పోలీసులు, ఇతర శాఖల అధికారులు ఘటనా స్థలికి చేరుకుని రక్షణ, సహాయ కార్యక్రమాలు చేపట్టారు. విద్యుత్తు షాక్‌కు గల కారణాలను అన్వేషిస్తున్నారు. శ్రావణ మాసం ఆదివారం కావడంతో పెద్దయెత్తున భక్తులు వచ్చారు. దానికి తోడు లక్షల మంది కన్వర్ యాత్రికులు హరిద్వార్‌కు చేరుకోవడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి.