చిక్కమంగుళూరు: కర్నాటక ముడా స్కామ్(Illegal Land Allotment)లో కొత్త విషయాలు బయటకు వచ్చాయి. కడూరు, ముడిగేరి తాలూకాల్లో సుమారు పది వేల ఎకరాల స్థలాన్ని అక్రమంగా కేటాయించారు. దాంట్లో ఇప్పటికే సీఎం సిద్దరామయ్య విచారణ ఎదుర్కొంటున్నారు. అయితే దర్యాప్తు రిపోర్టు ప్రకారం అక్కడ స్థలాన్ని ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలకు కేటాయించినట్లు తెలిసింది. వారితో పాటు మరో 326 మంది అధికారులు కూడా భూమి తీసుకున్నవారిలోఉన్నారు. అక్రమ కేటాయింపులకు రెగ్యులరైజేషన్ కమిటీ బాధ్యత వహించాల్సి ఉంటుందని రిపోర్టులో తెలిపారు.
కడూరు నియోజకవర్గ ఎమ్మెల్యేలు వైఎస్వీ దత్త, బెల్లి ప్రకాశ్, ముడిగేరి నియోజకవర్గ ప్రతినిధులు మోతమ్మ, ఎంపీ కుమారస్వామి, బీబీ నింగయ్య పేర్లు కూడా దర్యాప్తు రిపోర్టులో ఉన్నాయి. ప్రభుత్వం నియమించిన 13 మంది తహిసీల్దార్లు ఇచ్చిన నివేదికలో ఆ పేర్లు ఉన్నాయి. చిక్కమంగుళూరుకు చెందిన సీటీ రవి పేరు కూడా ఉన్నది.
అక్రమంగా భూమి పొందిన 326 మంది అధికారుల్లో.. 23 మంది తహిసిల్దారులు, 18 షిరస్తేదార్లు, 48 మంది రెవన్యూ ఇన్స్పెక్టర్లు, 104 మంది విలేజ్ ఆఫీసర్లు ఉన్నారు. మొత్తం 10,598 ఎకరాల భూమిని అక్రమంగా కేటాయించినట్లు రిపోర్టులో తెలిపారు. 6248 ఎకరాల స్థలాన్ని అనర్హులకు ఇచ్చినట్లు తెలిసింది.