న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: సీనియర్ సిటిజన్లకు రాయితీల ఎత్తివేత రైల్వేకు కాసుల వర్షం కురిపించింది. గత నాలుగేండ్లుగా ఆ శాఖకు అదనంగా రూ.5,800 కోట్ల ఆదాయం సమకూరింది. ఆర్టీఐ చట్టం ద్వారా ఈ విషయాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా కొవిడ్ ప్రారంభమైన 2020 మార్చి 20న వృద్ధులకు అప్పటివరకు రైలు టికెట్ చార్జీలపై ఇస్తున్న రాయితీని ఎత్తివేస్తున్నట్టు రైల్వే మంత్రి ప్రకటించారు. అంతకుముందు సీనియర్ సిటిజన్ కోటాలో మహిళలకు 50 శాతం, పురుషులు, ట్రాన్స్జెండర్లకు 40 శాతం టికెట్ చార్జీలో రాయితీ ఇచ్చేవారు. సబ్సిడీ ఎత్తివేతపై ఎంపీకి చెందిన చంద్రశేఖర్ ఆర్టీఐ చట్టం కింద వివరాలు సేకరించగా, 2020, మార్చి 20 నుంచి ఈ ఏడాది జనవరి 31 వరకు రైల్వేకు అదనంగా 5,875 కోట్ల ఆదాయం సమకూరినట్టు వెల్లడైంది.