Foreign terrorists | జమ్ముకశ్మీర్‌లో ఈ ఏడాదిలో 56 మంది విదేశీ ఉగ్రవాదులు హతమయ్యారు. తీవ్రవాద శ్రేణుల్లో చేరిన 102 మంది స్థానిక యువకుల్లో 86 మందిని తప్పించారు. ఈ విషయాలను జమ్ము కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ వెల్లడించారు. ఉగ్రవాద మార్గాన్ని ఎంచుకునే వారి జీవితం చాలా చిన్నదని, యువత ఉగ్రవాద మార్గాన్ని అవలంబించకుండా విద్య, ఉద్యోగ, ఉపాధి వైపు మళ్లాలని సూచించారు. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదం చివరి దశలో ఉన్నదని చెప్పిన సింగ్.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
సరిహద్దు వెంబడి ఉన్న పలు శిక్షణా శిబిరాల్లో ఇప్పటికీ ప్రజలున్నారని డీజీపీ దిల్బాగ్ సింగ్ చెప్పారు. కొందరు ఉగ్రవాదులు బలవంతంగా మన భూభాగంలోకి చొరబడుతున్నప్పటికీ సరిహద్దు బలగాలు సదా అప్రమత్తంగా ఉండి ఎదుర్కొంటున్నాయని తెలిపారు. డ్రోన్ల ద్వారా ఆయుధాల సరఫరా పెద్ద సవాల్‌గా మారిందన్నారు. చైనా కెమెరాలతో డ్రోన్ల రాకను పసిగడ్తున్నామని, పోలీసులు కొన్ని కేసులను ఛేదించడంలో సఫలం చెందారని చెప్పారు. పెద్ద మొత్తంలో ఐఈడీతోపాటు ఆధునిక ఆయుధాలు, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారన్నారు. ఇటువైపు నుంచి ఉగ్రవాద శిబిరాల వైపు వెళ్లకుండా అడ్డుకోవడంలో విజయం సాధించామని పేర్కొన్నారు. యువత ఉగ్రవాదం, రాళ్లు రువ్వడం వంటి వాటిని వదిలి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల వైపు తమ దృష్టిని కేటాయించాలని సూచించారు.