భువనేశ్వర్: చేతబడి చేస్తున్నాడన్న అనుమానంతో గ్రామస్తులు ఒక వ్యక్తిని కొట్టి చంపారు. అక్కడకు చేరుకున్న పోలీసులపై కూడా వారు దాడి చేశారు. ఒక పోలీస్ అధికారి గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో 28 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. (old man killed) ఒడిశాలోని రాయగడ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 55 ఏళ్ల భైరవ్ సాహు చేతబడి చేస్తున్నాడని గ్రామస్తులు అనుమానించారు. సోమవారం అర్ధరాత్రి వేళ అతడిపై దాడి చేశారు. కర్రలతో కొట్టి చంపారు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ గ్రామానికి చేరుకున్నారు. అయితే గ్రామస్తులు వారిపై కూడా దాడి చేశారు. ఈ సందర్భంగా ఒక పోలీస్ అధికారి గాయపడ్డాడు. దీంతో అదనపు పోలీసులను అక్కడ మోహరించారు.
మరునాడు ఫోరెన్సిక్ బృందం నేర సంఘటనా ప్రాంతానికి చేరుకున్నది. భైరవ్ సాహు హత్యకు వినియోగించిన కర్రలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నది. ఈ సంఘటనకు సంబంధించి 28 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఆ వ్యక్తి కుమార్తె ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.