చండీగఢ్: ముఖ్యమంత్రిని నియమించాలంటే కాంగ్రెస్ పార్టీలో భారీ మొత్తంలో సొమ్ము చేతులు మారుతుందని సూచిస్తూ పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవ్‌జోత్ సింగ్ సిద్ధూ భార్య, మాజీ ఎమ్మెల్యే నవ్‌జోత్ కౌర్ సిద్ధూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ ప్రజలు మిమ్మల్ని కోరుకుంటున్నప్పటికీ మీరు ఎందుకు ముఖ్యమంత్రి కాలేకపోయారన్న విలేకరుల ప్రశ్నకు ముఖ్యమంత్రి పదవిని పొందడానికి మా వద్ద రూ. 500 కోట్లు లేవు అని ఆమె జవాబిచ్చారు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేశారా అని ప్రశ్నించగా మమ్మల్ని ఎవరూ డబ్బు డిమాండు చేయలేదు. కానీ రూ. 500 కోట్ల సూట్‌కేసు ఎవరు ఇస్తారో వారే ముఖ్యమంత్రి అవుతారు అంటూ కౌర్ వ్యాఖ్యానించారు.
పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియాను శనివారం చండీగఢ్‌లోని రాజ్‌భవన్‌లో కలుసుకున్న అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతి భద్రతల పరిస్థితి సహా వివిధ సమస్యల గురించి తాను గవర్నర్‌తో చర్చించానని చెప్పారు. అంతేగాక ముఖ్యమంత్రి పదవిపై హామీ ఇస్తేనే తన భర్త మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తారని కూడా ఆమె స్పష్టంచేశారు. పార్టీకి ఇవ్వడానికి తమ వద్ద డబ్బు లేదని, అయితే తాము పంజాబ్‌ను బంగారు రాష్ట్రంగా మార్చగలమని నవ్‌జోత్ కౌర్ తెలిపారు.
రూ.500 కోట్లు చెల్లించిన వారికే ముఖ్యమంత్రి పదవి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసి పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన కౌర్ మంగళవారం పాటియాలాలో విలేకరులతో మాట్లాడుతూ మరోసారి పంజాబ్‌లోని కాంగ్రెస్ నాయకులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో కొందరు దొంగలు ఉన్నారని, ఎట్టి పరిస్థితిలో వారికి తాను మద్దతివ్వబోనని ఆమె తెలిపారు. రాష్ట్రంలో పార్టీని నాశనం చేస్తున్నవారిని పక్కనపెడితేనే తాను మళ్లీ పార్టీలో పనిచేయగలనని కౌర్ స్పష్టం చేశారు. పార్టీ అధిష్ఠానంతో చర్చలు జరుపుతున్నానని, అయితే పార్టీలోని దొంగలను తాను బలపరచబోనని ఆమె చెప్పారు.
పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కాంగ్రెస్‌ని నాశనం చేస్తున్న నలుగురైదుగురు దొంగలను పార్టీ నుంచి తరిమేయాలని ఆమె చెప్పారు. తన సస్పెన్షన్‌పై స్పందిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అమ్రీందర్ సింగ్ రాజా నుంచి తనకు అందిన నోటీసుకు ఎటువంటి చట్టబద్ధత లేదని ఆమె అన్నారు. అలాంటి నోటీసులు చాలానే వచ్చాయని, అయితే పార్టీ అధిష్ఠానంతో దీనిపై చర్చిస్తున్నానని ఆమె తెలిపారు.
యావత్ పంజాబ్ అంతా కోరుకుంటున్నప్పటికీ తాను ఎందుకు ముఖ్యమంత్రిని కాలేకపోయానన్న ప్రశ్నకు జవాబిస్తూ తాను రూ.500 కోట్లు ఉంటేనే సీఎం కుర్చీ దక్కుతుందని చెప్పానని కౌర్ విలేకరులకు వివరించారు. అయితే తమను ఎవరూ డబ్బు అడగలేదని ఆమె స్పష్టం చేశారు. కావాలంటే ఈడీ వంటి ఏజెన్సీలు తన భర్త నవ్‌జోత్ సింగ్ సిద్ధూను విచారణ చేసుకోవచ్చని ఆమె చెప్పారు.