సిమ్లా: భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడడం వల్ల హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh)లో పరిస్థితి దారుణంగా ఉన్నది. ఇక చండీఘడ్ .. కులు రహదారి పూర్తిగా వాహనాలతో స్తంభించిపోయింది. సుమారు 50 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామైంది. వేల సంఖ్యలో వాహనాలు రోడ్డుపై ఉండిపోయాయి. కీలకమైన నిత్యావసరాలు తీసుకెళ్తున్న ట్రక్కులు చాలా రోజుల నుంచి కదలడం లేదు. దీంతో ఢిల్లీ, ఎన్సీఆర ప్రాంతానికి సరఫరా దెబ్బతిన్నది.
చండీఘడ్-మనాలీ హైవేపై పలు ప్రాంతాల్లో రోడ్డు బ్లాక్ అయ్యింది. మండీ, కులు పాయింట్ల వద్ద వాహనాలు ఆగిపోయాయి. చిన్న వాహనాలకు క్లియరెన్స్ దక్కినా.. భారీ ట్రక్కులకు మాత్రం ఇంకా క్లియరెన్స్ లభించడం లేదు. దీంతో పండ్లు, కూరగాయలు, ఇతర కీలక వస్తువుల తరలింపు కష్టసాధ్యమవుతోంది. తీవ్ర వర్షాల వల్ల నష్టం కూడా తీవ్రంగా ఉన్నట్లు ట్రక్కు డ్రైవర్లు చెబుతున్నారు. యాపిల్ పండ్లు, టమోటాలు, కూరగాయలతో కూడిన ట్రక్కులు నిలిచిపోవడంతో అవన్నీ కుళ్లిపోతున్నాయి. ప్రతి ట్రక్కులో సుమారు 5 లక్షల మేర సరుకు ఉన్నట్లు భావిస్తున్నారు. అయితే కనీసం 50 కోట్లు ఖరీదు చేసే యాపిల్ పండ్లు ఆ వాహనాల్లోనే మురిగిపోతున్నట్లు డ్రైవర్లు చెబుతున్నారు. కూరగాయల మండీల వద్ద ట్రక్కులు జామ్ కావడంతో యాపిల్స్ అన్నీ కళ్లిపోతున్నట్లు ఓ డ్రైవర్ తెలిపాడు.
మరో వైపు బియానస్ నది ఉగ్రంగా ప్రవహిస్తున్న కారణంగా అనేక ప్రాంతాల్లో రోడ్లు తెగుతున్నాయి. రామ్శిల వద్ద ఇండ్లు డ్యామేజ్ అయ్యాయని, చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని స్థానికులు కోరారు.