జమ్మూ, డిసెంబర్ 24: జమ్మూ కశ్మీరులోని పూంఛ్ జిల్లాలో మంగళవారం ఘోర ప్రమాదం సంభవించింది. మెంధర్‌లోని బల్నోయి ప్రాంతంలో సైనిక వాహనం అదుపుతప్పి 350 అడుగుల లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు సైనికులు మృతిచెందగా మరో ఐదుగురు గాయపడ్డారు. 11 మద్రాస్ లైట్ ఇన్ఫాంట్రీకి (11ఎంఎల్ఐ) చెందిన సైనిక వాహనం నీలం హెడ్‌క్వార్టర్స్ నుంచి బల్నోయి ఘోరా పోస్టుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు.
గమ్యస్థానానికి సమీపంలో 350 అడుగుల లోయలో వాహనం పడిపోయినట్టు వారు చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే 11ఎంఎల్ఐకి చెందిన క్విక్ రియాక్షన్ టీమ్ ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రులకు తక్షణ వైద్య సహాయం అందచేసిన సిబ్బంది వారికి మెరుగైన చికిత్స కోసం వేరే దవాఖానాలకు తరలించింది. గత నెలలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. జమ్మూ కశ్మీరులోని రాజౌరీ జిల్లాలో సైనిక వాహనం అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఒక సైనికుడు మరణించగా మరో వ్యక్తి గాయపడ్డారు.