లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మౌ జిల్లా షాపూర్‌లోని ఓ ఇంట్లో అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఇళ్లు పూర్తిగా ధ్వంసమైపోయింది.
మృతుల్లో మహిళ, పురుషుడితోపాటు ముగ్గురు మైనర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఇంట్లో గ్యాస్ స్టవ్ నుంచి మంటలు చెలరేగడమే అగ్నిప్రమాదానికి కారణమని ప్రాతమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.