ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో గత కొన్నేండ్లుగా ‘లేఆఫ్’ తుఫాన్ అలజడి రేపుతున్నది. లక్షలాది ఉద్యోగాలను తుడిచిపెట్టేసింది. భారత్‌లోనూ దీని ప్రభావం ఉన్నప్పటికీ, టీసీఎస్ ఇటీవల చేపట్టిన తొలగింపులతో ఇది ఊపందుకున్నది. రానున్న రెండు మూడేండ్లలో భారత్‌లో ఏకంగా 5 లక్షల మంది టెకీలపై వేటు పడే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తుండటం టెకీల్లో గుబులు రేపుతున్నది. ఏఐ వినియోగం పెరగడం, ఆర్థిక మందగమనం, ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
IT Employees | న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ).. ఇప్పుడిది అన్ని రంగాలను భయపెడుతున్నది. ప్రాథమిక కోడింగ్, సాఫ్ట్వేర్ టెస్టింగ్, కస్టమర్ సపోర్ట్, మౌలిక సదుపాయాల నిర్వహణ వంటి వాటి కోసం దీనిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. గతంలో ఈ పనులకు పెద్ద ఎత్తున టీంలు అవసరమయ్యేవి. పరిశ్రమ విశ్లేషకులు చెప్తున్న దాని ప్రకారం ఆటోమేషన్ కారణంగా కొత్త నైపుణ్యాలు అవసరమవుతాయి. కానీ, చాలామంది ఉద్యోగులకు ఆ నైపుణ్యాలు లేవు. దీంతో రాబోయే రెండు మూడు సంవత్సరాలలో 4 నుంచి 5 లక్షల మంది రోడ్డున పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్టాఫింగ్ డాటా ప్రకారం 13-25 సంవత్సరాల అనుభవం ఉన్న సుమారు 4.3 లక్షల మంది భారతీయ ఐటీ నిపుణులకు ఉద్యోగ భద్రత తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా సాంకేతిక నైపుణ్యం లేని పీపుల్ మేనేజర్లు, సాఫ్ట్వేర్ టెస్టర్లు, మౌలిక సదుపాయాల సపోర్ట్ స్టాఫ్‌కు ఈ ముప్పు ఎక్కువగా ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం అంచనా వేసిన తొలగింపుల్లో దాదాపు 70 శాతం 4-12 సంవత్సరాల అనుభవం ఉన్న ఉద్యోగులపై ప్రభావం చూపుతుంది.
దేశ జీడీపీలో ఐటీ రంగం 7 శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉంది. ఇది లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలను కల్పిస్తూ, గృహాలు, కార్లు, పర్యాటకం, విలాసవంతమైన వస్తువులకు డిమాండ్‌ను పెంచుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగాలు భారీగా తొలగిస్తే వినియోగదారుల ఖర్చు తగ్గి, పెట్టుబడులు ఆలస్యం అవుతాయి. ఇది ముఖ్యంగా పట్టణ మధ్యతరగతి మార్కెట్లలో ఆర్థిక వృద్ధిని బలహీనపరుస్తుంది. ఉద్యోగుల తొలగింపునకు ముందు 6.13 లక్షల మంది ఉద్యోగులు ఉన్న టీసీఎస్ ఏఐలో పెట్టుబడులు పెడుతూ, కొత్త మార్కెట్లలోకి ప్రవేశిస్తూ, తమ ఉద్యోగుల పనితీరును మెరుగుపరుచుకుంటున్నది. తద్వారా భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నది. ఉద్యోగాలు కోల్పోతున్న మిడిల్, సీనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగులు అడ్వాన్స్డ్ డిజిటల్, ఏఐ నైపుణ్యాలు అవసరమయ్యే మార్కెట్లో కొత్త ఉద్యోగాలు కనుగొనడం కష్టమని ఆందోళన చెందుతున్నారు.
గతంలో సాంకేతిక మార్పులు ఎక్కువగా సంస్థలను ప్రభావితం చేశాయని, కానీ ఏఐతో వ్యక్తులు స్వయంగా నైపుణ్యాలను మెరుగుపరచుకోవాల్సిన బాధ్యత ఉందని నాస్కామ్ పేర్కొంది. దానిని అందిపుచ్చుకోలేని వారు వెనుకబడిపోతారని, ఎందుకంటే ఆటోమేషన్ వ్యాపార కార్యకలాపాలలో ప్రధానాంశం అవుతుందని టెక్ మహీంద్రా మాజీ సీఈవీ సీపీ గుర్నాని హెచ్చరించారు. కాగా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)12,200 మంది మిడిల్, సీనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగులను ఇంటికి పంపుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది ఆ సంస్థ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో రెండు శాతం. దేశంలోని 283 బిలియన్ డాలర్ల ఐటీ సేవల విభాగంలో ఏఐ ఆధారిత పరివర్తనకు ఇది ముందస్తు సంకేతమని పరిశ్రమ నిపుణులు హెచ్చరిస్తున్నారు.