HIV | మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తలసీమియా (thalassemia)తో బాధపడుతున్న ఐదుగురు చిన్నారులు చికిత్స కోసం వెళ్లగా.. వైద్యుల నిర్లక్ష్యం ఆ పిల్లలకు జీవితాన్నే లేకుండా చేసింది. చికిత్సలో భాగంగా వైద్యులు ఆ చిన్నారులకు హెచ్ఐవీ (HIV) సోకిన రక్తం ఎక్కించారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
సత్నా (Satna)కు చెందిన కొందరు చిన్నారులు తలసీమియా వ్యాధితో బాధపడుతున్నారు. తల్లిదండ్రులు వారిని సత్నాలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పిల్లల్ని పరీక్షించిన వైద్యులు వారికి రక్తమార్పిడి చేశారు. 150 మందికి పైగా దాతల నుండి సేకరించిన రక్తాన్ని మూడు వేర్వేరు బ్లడ్ బ్యాంక్స్ నుంచి తీసుకొచ్చి చిన్నారులకు ఎక్కించారు. ఈ రక్తమార్పిడితో చిన్నారులకు ప్రాణాంతక హెచ్ఐవీ బారిన పడ్డారు.
రక్తం ఎక్కించిన కొన్ని రోజులకే చిన్నారులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో వారికి రక్త పరీక్షలు చేయగా హెచ్ఐవీ సోకినట్లు నిర్ధారణఅయింది. రిపోర్ట్స్ చూసి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. కుటుంబ సభ్యుల్లో ఎవరికీ ఈ వ్యాధి లేకపోయినా.. పిల్లలకు సంక్రమించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, వ్యాధి సోకిన సూది వాడటంగానీ లేదంటే కలుషిత రక్తాన్ని ఎక్కించడం ద్వారాగానీ ఈ వ్యాధి సంక్రమించి ఉండవచ్చని సత్నా ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ ఇన్చార్జ్ దేవేంద్ర పటేల్ తెలిపారు. తలసీమియాతో బాధ పడుతున్న ఈ ఐదుగురు పిల్లలకు అనేకసార్లు రక్తమార్పిడి చికిత్స జరిగినట్లు గుర్తించారు.
ఇక ఈ ఘటనపై ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కఠిన చర్యలకు ఉపక్రమించింది. బ్లడ్‌బ్యాంక్ ఇన్చార్జ్, ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లను విధుల నుంచి సస్పెండ్ చేసింది. సత్నా జిల్లా ఆసుపత్రి మాజీ సివిల్ సర్జన్‌కు షోకాజు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై లిఖితపూర్వక వివరణ సమర్పించాలని ఆదేశించింది. అంతేకాదు, వివరణ సంతృప్తికరంగా లేకుంటే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, సత్నా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఏడాది మార్చి నెలలో తొలి హెచ్ఐవీ పాజిటివ్ కేసు నమోదైంది. మార్చి 20వ తేదీన 15 ఏళ్ల తలసీమియా పేషంట్‌కు హెచ్ఐవీ పాజిటివ్ వచ్చింది. మార్చి 26 నుంచి 28 వరకు మరో ఇద్దరు చిన్నారులకు హెచ్ఐవీ పాజిటివ్ వచ్చింది. ఏప్రిల్ 3వ తేదీన మరో కేసు నమోదు అయింది. ఇలా మొత్తం ఐదుగురు చిన్నారులు హెచ్ఐవీ బారిన పడ్డారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల జీవితాలతో వైద్యులు ఆటలాడుతున్నారంటూ మండిపడ్డారు.
Also Read..
Jammu Kashmir | చలి గుప్పిట్లో అందాల కశ్మీర్.. మైనస్ డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు
Air Pollution | తీవ్ర కాలుష్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి.. 150 విమానాలు రద్దు
Bangladesh Protests | బయటకు రావొద్దు.. బంగ్లా అల్లర్ల నేపథ్యంలో భారతీయులకు కీలక అడ్వైజరీ