న్యూఢిల్లీ, అక్టోబర్ 13: గత నాలుగేండ్లుగా షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ (ఎన్సీఎస్సీ)కు 47 వేల ఫిర్యాదులు అందాయి. అధికారులు తాజాగా విడుదల చేసిన డాటా ప్రకారం ఇందులో ప్రధానంగా దళితులపై దాడులు, భూమి, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయి. ఈ మేరకు పీటీఐ సంస్థ సమాచార హక్కు చట్టం దరఖాస్తుకు స్పందించి ఎన్సీఎస్సీ ఈ వివరాలను అందజేసింది.
ఈ సందర్భంగా కమిషన్ చైర్పర్సన్ కిశోర్ మఖ్వానా మాట్లాడుతూ వీటిలో యూపీలో అత్యధికంగా ఎక్కువ ఫిర్యాదులు నమోదయ్యాయన్నారు. ఒక్కో రోజు కమిషన్కు 200 నుంచి 300 వరకు ఫిర్యాదులు అందుతున్నాయని, వాటిని కొన్ని రోజుల్లోనే పరిష్కరిస్తున్నట్టు చెప్పారు. తమకు వచ్చిన ఫిర్యాదులలో ఒక్క దానిని కూడా నిర్లక్ష్యం చేయలేదని, అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు.