Current Bill | ముంబై, ఆగస్టు 21(నమస్తే తెలంగాణ): కరెంటు కనెక్షన్ ఇవ్వకముందే రైతుకు భారీ బిల్లు పంపింది మహారాష్ట్ర విద్యుత్తు సరఫరా సంస్థ ఎంఎస్ఈబీ. దీనిపై రైతు ఫిర్యాదు చేయగా, బిల్లు రద్దు చేయకపోగా మరో రూ.11,750 చేర్చి కొత్త బిల్లు పంపించింది. అమరావతి జిల్లా అచల్పూర్ తాలూకాలోని కండ్లికి చెందిన అశోక్ వాశంకర్ అనే రైతు తన పొలంలో విద్యుత్తు కనెక్షన్ కోసం 2021 జూన్ 22, 2023 డిసెంబర్ 16న ఎంఎస్ఈబీకి దరఖాస్తు చేసుకున్నాడు.
కనెక్షన్ ఇవ్వడానికి రూ.16,185 చెల్లించాలని ఈ సంస్థ రైతుకు కొటేషన్ ఇచ్చింది. ఈ మొత్తం చెల్లించినా విద్యుత్ కనెక్షన్ మాత్రం ఇవ్వలేదు. కానీ, రూ.44 వేల కరెంటు బిల్లు మాత్రం పంపించింది. ఈ బిల్లుపై ఫిర్యాదు చేయగా రూ.55,750తో కొత్త బిల్లు పంపింది. దీంతో రైతు దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు.