Karnataka | బెంగళూరు, ఫిబ్రవరి 8: కర్ణాటకలో ప్రభుత్వాలు మారినా అవినీతి, కమీషన్ల పర్వానికి మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. ‘40% కమీషన్ రాజ్’గా మునుపటి బీజేపీ సర్కారుపై ముద్రపడిన విషయం తెలిసిందే. దీంతో గత ఎన్నికల్లో బీజేపీని గద్దె దింపి కాంగ్రెస్కు ప్రజలు అధికారం కట్టబెట్టారు. అయితే హస్తం పార్టీ అధికార పగ్గాలు చేపట్టి ఏడాది కూడా కాకమునుపే ఆ పార్టీపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ సర్కారును మించి కాంగ్రెస్ హయాంలో అవినీతి పెచ్చరిల్లిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కర్ణాటక రాష్ట్ర కాంట్రాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు డీ కెంపెన్న తాజాగా చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ‘40 శాతం కమీషన్’.. కాంగ్రెస్ సర్కారులోనూ కొనసాగుతున్నదని గురువారం ఆయన సంచలన ఆరోపణలు చేశారు. మునుపటి బీజేపీ సర్కారులో ప్రజాప్రతినిధులే కమీషన్లు డిమాండ్ చేసేవారని, ఇప్పుడు అధికారులు కూడా డిమాండ్ చేస్తున్నారని మండిపడ్డారు.
‘కర్ణాటకలో అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. ఇప్పటివరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు మమ్మల్ని కమీషన్లు అడిగేవారు. కాంట్రాక్ట్ పని కావాలంటే నిర్దిష్ట మొత్తం చెల్లించాలని డిమాండ్ చేసేవారు. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. అధికారులు కూడా కమీషన్లు డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ కావాలంటే, ముడుపులు ఇవ్వాల్సిందేనని చెప్తున్నారు’ అని కెంపెన్న ఆరోపించారు. అధికారుల పేర్లు వెల్లడించాలని విలేకర్లు అడగ్గా.. తనపై ఇప్పటికే 5 పరువునష్టం కేసులు ఉన్నాయని, ప్రస్తుతానికి అధికారుల పేర్లు వెల్లడించడం లేదని చెప్పారు. ‘అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ లంచగొండి అధికారులు ఉన్నారు. కొంత మంది మరీ దారుణం. బృహత్ బెంగళూరు మహానగర పాలికె అయినా, ప్రజాపనుల విభాగమైనా, నీటి పారుదల శాఖ అయినా.. అన్నిట్లోనూ అవినీతి అధికారులు ఉన్నారు. అధికారుల్లో అహంకారం పెరిగిపోయింది. దానికి వ్యతిరేకంగా మేం పోరాడుతున్నాం’ అని పేర్కొన్నారు. ఎంత కమీషన్ అడుగుతున్నారని ప్రశ్నించగా.. 40 శాతం కమీషన్ కొనసాగుతున్నదని సమాధానమిచ్చారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో ప్యాకేజ్ సిస్టమ్ కొనసాగుతున్నదని ఆరోపించారు. స్థానిక కాంట్రాక్టర్లను కాదని, పొరుగు రాష్ర్టాల కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకే ఇలా చేస్తున్నారని, దీని వల్ల రాష్ర్టానికి చెందిన చిన్న, మధ్య స్థాయి కాంట్రాక్టర్లు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మునుపటి బీజేపీ హయాంలో కమీషన్లకు వ్యతిరేకంగా కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. కొందరు కాంట్రాక్టర్లు ఆత్మహత్యకు సైతం పాల్పడ్డారు. గత ఎన్నికల్లో ఇది ప్రధాన ప్రచార అస్త్రంగా మారింది. అవినీతిని అడ్డుకుంటామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే బీజేపీని మించి కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి కొనసాగుతున్నదని కాంట్రాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.