డెహ్రాడూన్: రైల్వే ఆక్రమిత స్థలంలో ఉన్న సుమారు నాలుగు వేల ఇండ్లు, పలు స్కూళ్లు, ప్రార్థనా మందిరాల కూల్చివేతకు అనుకూలంగా ఉత్తరాఖండ్ హైకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. దీనిని అమలు చేసేందుకు అధికారులు ఇటీవల నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్లుగా అక్కడ ఉంటున్న వారంతా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం గురువారం విచారణ జరుపనున్నది.
ఉత్తరాఖండ్ హల్దావానీలో సుమారు 29 ఎకరాల రైల్వే భూమిని పలువురు ఆక్రయించారు. ఇళ్లు నిర్మించుకుని ఎన్నో ఏళ్లుగా అక్కడ నివసిస్తున్నారు. ఈ ప్రాంతంలో నాలుగు ప్రభుత్వ స్కూళ్లు, 11 ప్రైవేట్ స్కూళ్లు, ఒక బ్యాంక్, రెండు వాటర్ ట్యాంకులు, పది మసీదులు, నాలుగు గుళ్లు, పలు షాపులు ఉన్నాయి.
కాగా, ఈ ఆక్రమణలపై రైల్వేకు అనుకూలంగా ఉత్తరాఖండ్ హైకోర్టు డిసెంబర్ 20న తీర్పు ఇచ్చింది. నోటీసులు ఇచ్చి వారంలోగా ఆక్రమణలను తొలగించాలని రైల్వే, స్థానిక అధికారులను ఆదేశించింది. దీంతో రెండు కిలోమీటర్ల పరిధిలోని రైల్వే స్థలంలో ఉన్న బంభుల్పురా, గఫూర్ బస్తీ, ధోలక్ బస్తీ, ఇందిరా నగర్ ప్రాంతాలను అక్రమ నివాసితులు ఈ నెల 9లోగా ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. లేకపోతే కూల్చివేతలు చేపడతామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రైల్వే పోలీసులు, అధికారులు ఆయా ప్రాంతాల్లో పర్యటించి పరిశీలించారు.
మరోవైపు చాలా ఏళ్లుగా అక్కడ నివాసం ఉంటున్న ప్రజలు హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టారు. తమ ఇళ్లను తొలగించవద్దని కోరుతూ సామూహిక ప్రార్థనలు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో ఎక్కువగా ముస్లింలు నివాసం ఉండటంతో రాష్ట్రంలోని అధికార బీజేపీ వారిపై కక్షగట్టిందని కాంగ్రెస్, ఇతర పార్టీ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ సీనియర్ నేత, ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీష్ రావత్ కూడా నివాసితులకు మద్దతు తెలిపారు. డెహ్రాడూన్లోని తన నివాసంలో గంటపాటు మౌన నిరాహార దీక్ష చేశారు.