బెంగుళూరు: కర్నాటకలో మహిళలకు ఉచిత బస్సు స్కీమ్(Travel Scheme)పై తీవ్ర విమర్శలు వెల్తువెత్తుతున్నాయి. కేఎస్ఆర్టీసీకి అక్కడి రాష్ట్ర ప్రభుత్వం సుమారు 4000 కోట్లు బాకీ ఉన్నట్లు తెలుస్తోంది. శక్తీ స్కీమ్ కింద మహిళలకు కర్నాటక సర్కారు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నది. అయితే ఆ స్కీమ్ కింద రావాల్సిన 4 వేల కోట్లు ఇంకా బాకీ ఉన్నట్లు ఆర్టీసీ పేర్కొన్నది. కర్నాటక అసెంబ్లీలో దీనికి సంబంధించిన నివేదికను రావాణా శాఖ ప్రవేశపెట్టింది. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని జూన్ 11, 2023లో ప్రారంభించార. కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(కేఎస్ఆర్టీసీ), బెంగుళూరు మెట్రోపాలిటన్ రవాణా సంస్థ(బీఎంటీసీ), వాయవ్య కర్నాటక రవాణా సంస్థ(ఎన్డబ్ల్యూకేఆర్టీసీ), కల్యాణ రోడ్డు రవాణా సంస్థ(కేకేఆర్టీసీ) ఇప్పటి వరకు సుమారు 650 కోట్ల మంది మహిళా ప్రయాణికులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది.
కర్నాటక ప్రభుత్వం గత మూడేళ్ల నుంచి సగటును వెయ్యి కోట్లకు పైగా రాష్ట్ర రవాణా శాఖకు బాకీ ఉన్నది. 2023-24 సంవత్సరానికి 1181 కోట్లు, 2024-25 సంవత్సరానికి 1171 కోట్లు, 2025-26 నవంబర్ వరకు 1656 కోట్లు కర్నాటక ప్రభుత్వం ఆర్టీసికి బాకీ ఉన్నది. అయితే మొత్తం కలిపి 4 వేల కోట్లు దాటింది. ఇక ఇప్పటి వరకు ఉచిత బస్సు స్కీమ్ కోసం 11,748 కోట్లను రిలీజ్ చేసినట్లు సర్కారు పేర్కొన్నది. పెండింగ్‌లో ఉన్న నిధుల వల్ల ఆర్టీసీ సంస్థ ఆర్థిక సమస్యలు తలెత్తుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వ ఆర్టీసీ విభాగాన్ని కాంగ్రెస్ సర్కారు నాశనం చేస్తున్నట్లు బీజేపీ ఆరోపించింది. ప్రజా రవాణా వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని పేర్కొన్నది. కర్నాటక ఆర్టీసికి భారీగా నష్టాలు వస్తున్నాయని, అయితే ఉచిత బస్సు స్కీమ్‌తో ఆ నష్టం మరీ ఎక్కువగా ఉందని మండలి ప్రతిపక్ష నేత చాలువాడి నారాయణస్వామి తెలిపారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసిని కాపాడకుండా, దాన్ని ఆర్థికంగా మరింత దెబ్బతీస్తున్నట్లు ఆయన ఆరోపించారు. కానీ కాంగ్రెస్ సర్కారు మాత్రం శక్తీ స్కీమ్ పట్ల ధీమాగా ఉన్నది. ప్రజా రవాణా వ్యవస్థను మహిళలు విస్తృతంగా వినియోగిస్తున్నట్లు ఆ పార్టీ పేర్కొన్నది. త్వరలోనే అన్ని బాకీలను చెల్లిస్తామని పార్టీ పేర్కొన్నది. మహిళలకు వ్యతిరేకంగా బీజేపీ ప్రవర్తిస్తున్నదని రవాణా శాఖ మంత్రి రామలింగం ఆరోపించారు.