న్యూఢిల్లీ, జూన్ 20: చైనా గత ఏడాది నవంబర్‌లో ఆవిష్కరించిన 40 జే-35 యుద్ధ విమానాలను పాకిస్థాన్‌కు అందించనుంది. అత్యంత వేగంగా పయనించే ఈ ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్లను రాడార్ లేదా సోనార్ వ్యవస్థల ద్వారా కనుగొనడం అత్యంత కష్టతరం. ఇటువంటి విమానాలున్న అతికొద్ది దేశాల సరసన పాక్ చేరింది. భారత్ వద్ద ప్రస్తుతానికి ఇంతటి అధునాతన యుద్ధ విమానాలు లేవు.
జే-35 యుద్ధ విమానాలు అమెరికా వద్దనున్న అత్యంత ఖరీదైన ఎఫ్-35తో సమానమని చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ వార్తా సంస్థ తెలిపింది. రెండు ఇంజిన్లు, ఒకే సీటు ఉండే జే-35లో అత్యంత అధునాతన వ్యవస్థను అమర్చినట్టు పేర్కొంది. ఇంతవరకు ఏ యుద్ధంలోనూ ఈ విమానాన్ని వినియోగించనందున దీని సామర్థ్యంపై ఎటువంటి వివరాలు అందుబాటులో లేవు. ఈ విమానాల కొనుగోలుతో పాక్ గగనతల యుద్ధతంత్రంలో భారత్‌పై పైచేయిగా ఉండగలదని నిపుణులు పేర్కొంటున్నారు.