Pune child : మహారాష్ట్రలోని పూనే పరిధిలో దారుణం జరిగింది. నాలుగేళ్ల చిన్నారిపై 65 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడి, హత్య చేశాడు. ఈ ఘటనతో స్తానికులు ఆందోళనకు దిగారు. చివరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలివి. పూనే, భోర్ తహసీల్ పరిధిలోని ఒక గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. నాలుగేళ్ల చిన్నారిని ఒక వృద్ధుడు ఫుడ్ ఇప్పిస్తానని చెప్పి, తనతో తీసుకెళ్లాడు. దగ్గర్లోని ఒక పశువుల పాకలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం చిన్నారిని చంపేశాడు.
అయితే, చిన్నారి పాప కనిపించకపోవడంతో తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు తీవ్రంగా వెతికారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఒక ఇంటి సీసీ కెమెరాలో ఈ ఘటనకు సంబంధించిన దృశ్యం రికార్డైంది. వృద్దుడు చిన్నారిని తీసుకెళ్తున్నట్లు రికార్డ్ కావడంతో విషయం బయటపడింది. ఘటన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపారు. ఈ ఘటన గురించి తెలియడంతో స్థానికులు తీవ్ర ఆందోళన నిర్వహించారు. బెంగళూరు–ముంబై హైవేను దిగ్బంధించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
అంతేకాదు, 15 రోజుల్లోగా ఛార్జిషీటు దాఖలు చేయాలని కోరారు. వీరి ఆందోళనతో కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది. వెంటనే పోలీసు ఉన్నతాధికారులు, ఇతర అధికారులు నిరసనకారుల వద్దకు చేరుకున్నారు. నిందితుడిని త్వరగా అరెస్టు చేస్తామని, కఠిన శిక్ష పడేలా చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేశారు. మరోవైపు ఈ ఘటనపై అక్కడి ప్రతిపక్షం మండిపడింది. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని విమర్శించింది. అయితే, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పింది.