Encounter | ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్లో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు. మావోయిస్టుల ఉనికి గురించి సమాచారం నేపథ్యంలో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో అటవీ ప్రాంతంలో కాల్పులు జరిగాయని బస్తర్ రేంజ్ ఐడీ సుందర్రాజ్ పీ తెలిపారు. కాల్పులు జరిగిన ప్రాంతం నుంచి ఇప్పటి వరకు నలుగురు మావోయిస్టుల మృతదేహాలను స్వాధఋనం చేసుకున్నామన్నారు. ఇంకా కాల్పులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ఇన్సాస్, ఎస్ఎల్ఆర్ రైఫిల్స్ సహా భారీ మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని ఆయన వివరించారు. ప్రస్తుతం ఇంకా ఆపరేషన్ కొనసాగుతుందన్నారు. తాజాగా ఎన్కౌంటర్లో ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది 225 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఇందులో 208 మంది బీజాపూర్, బస్తర్, కాంకేర్, కొండగావ్, నారాయణపూర్, సుక్మా, దంతేవాడ జిల్లాల్లోని బస్తర్ డివిజన్లో ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉండగా వచ్చే ఏడాది మార్చ్ నాటికి మావోయిస్టులను నిర్మూలించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.