హల్ద్వాని: ఉత్తరాఖండ్లో మదరసా కూల్చివేత భారీ హింసకు దారి తీసింది. హల్ద్వాని జరిగిన ఆ హింసలో నలుగురు మృతిచెందారు. 250 మంది గాయపడ్డారు. ఈ ఘటన గురువారం జరిగింది. దీంతో ఆ సిటీలో కర్ఫ్యూ విధించారు. పరిస్థితి అదుపు తెప్పిన నేపథ్యంలో అక్కడ కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు జారీ చేశారు. అల్లర్లు కొనసాగుతున్న కారణంగా ఇంటర్నెట్ సేవల్ని రద్దు చేశారు. స్కూళ్లు, కాలేజీలను మూసివేశారు.
కోర్టు ఆదేశాల ప్రకారం అక్రమంగా నిర్మించిన మదరసాను కూల్చివేసేందుకు ప్రభుత్వ అధికారులు ప్రయత్నించారు. భారీ పోలీసు బందోబస్తుతో అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లారు. మదరసా, మసీదు అక్రమ స్థలంలో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. బుల్డోజర్తో కూల్చివేతకు దిగారు. హల్ద్వానిలోని వన్బుల్పురా ప్రాంతంలో ఉన్న జనం ఒక్కసారిగా ఎదురుతిరిగారు. దీంతో అక్కడ హింస చోటుచేసుకున్నది.
ప్రభుత్వ అధికారులు, మున్సిపల్ వర్కర్లు, జర్నలిస్టులు గాయపడ్డవారిలో ఉన్నారు. దాడికి దిగిన వారిని అసాంఘీక శక్తులుగా అభివర్ణించారు. మదరసా కూల్చివేత ఘటనను అడ్డుకునేందుకు వచ్చిన వాళ్లు రాళ్లతో దాడి చేశారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. పోలీసు స్టేషన్ వద్ద ఉన్న వాహనాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. దీంతో శాంతి భద్రతలు మరింత బలహీనపడ్డాయి.
మదరసా, మసీదును అక్రమ స్థలంలో కట్టారని, దాన్ని కూల్చివేయాలని కోర్టు ఇటీవల ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాల ప్రకారమే ప్రభుత్వ అధికారులు పోలీసుల సాయంతో అక్కడకు వచ్చారు. కోర్టు ఆదేశాల ప్రకారమే తాము అక్కడకు వెళ్లినట్లు ఎస్పీ ప్రహ్లాద్ మీనా తెలిపారు. బుల్డోజర్ రంగంలోకి దిగడంతో.. అక్కడు ఉన్న స్థానికులు, మహిళలు వీధుల్లో ప్రదర్శనకు దిగారు. బారికేట్లను తొలగిస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో క్రమంగా అక్కడ పరిస్థితి సమస్యాత్మకంగా మారింది. ఆ సమయంలో జనం అధికారుల మీదకు రాళ్లు రువ్వారు.
కోర్టు ఆదేశాలతోనే కూల్చివేత ప్రక్రియ జరిగినట్లు సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. సంఘవిద్రోహ శక్తులే అక్కడ హింసకు దిగినట్లు ఆయన ఆరోపించారు. గతంలోనే మసీదు, మదరసా ఉన్న ప్రాంతంలోని మూడు ఎకరాలను సీజ్ చేశామని మున్సిపల్ కమీషనర్ పంకజ్ ఉపాధ్యాయ తెలిపారు. ముందస్తు జాగ్రత్తగా నగరంలో కర్ఫ్యూ విధించినట్లు అధికారులు చెప్పారు.