జైపూర్: రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేస్తున్న వారి మీదకు లారీ దూసుకెళ్లింది. ఈ సంఘటనలో నలుగురు మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. (road accident) రాజస్థాన్లోని దుంగార్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో పెళ్లి వేడుకకు హాజరై తిరుగు ప్రయాణమైన కుటుంబం ప్రయాణించిన వ్యాన్, పిండవాల్ హిలావాడి బస్టాండ్ సమీపంలో రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ వ్యాన్లో ఉన్న నలుగురు స్వల్పంగా గాయపడ్డారు.
కాగా, పెళ్లి వేడుక నుంచి తిరిగి వస్తున్న మరికొందరు ఈ ప్రమాదాన్ని చూశారు. బైకులపై ఉన్న వారు అక్కడ ఆగారు. వ్యానులో ఉన్న గాయపడిన వారికి సహాయం చేసేందుకు మరికొందరు ప్రయత్నించారు. ఇంతలో ఒక లారీ వేగంగా వచ్చింది. సహాయం చేస్తున్న వారి మీదకు అది దూసుకెళ్లింది. ఈ ఘటనలో మూడు బైకులు లారీ కింద చిక్కుకున్నాయి. గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించారు.
మరోవైపు గాయపడిన వారిలో నలుగురు మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారని పోలీస్ అధికారి తెలిపారు. మరో ఎనిమిది మందికి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.