Bank Accounts | న్యూఢిల్లీ: మన దేశంలోని బ్యాంకు ఖాతాదారుల్లో 39.2 శాతం మంది మహిళలే. గ్రామీణ ప్రాంతాల్లో 42.2 శాతం మహిళా బ్యాంకు ఖాతాదారులు ఉన్నారు. మొత్తం డిపాజిట్లలో 39.7 శాతం డిపాజిట్లు మహిళలవే. గత కొన్నేళ్లుగా డీమ్యాట్ అకౌంట్లు కూడా పెరుగుతున్నాయి. అంటే స్టాక్ మార్కెట్లో భాగస్వామ్యం పెరుగుతున్నదన్నమాట. 2021 మార్చి 31 నుంచి 2024 నవంబరు 30నాటికి డీమ్యాట్ అకౌంట్ల సంఖ్య 3.32 కోట్ల నుంచి 14.30 కోట్లకు పెరిగింది. అంటే నాలుగు రెట్లు కన్నా ఎక్కువ పెరుగుదల నమోదైంది.
కేంద్ర ప్రభుత్వ గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వ శాఖ ఈ వివరాలను వెల్లడించింది. ‘విమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా, 2024: సెలెక్టెడ్ ఇండికేటర్స్ అండ్ డేటా’ శీర్షికతో ఈ వివరాలను ప్రచురించింది. జనాభా, విద్య, ఆరోగ్యం, ఆర్థిక భాగస్వామ్యం, నిర్ణయీకరణ వంటి ముఖ్యమైన అంశాలపై ఈ నివేదికను రూపొందించింది.