Ayodhya: అయోధ్యలో నిర్మితమవుతున్న రామమందిరంలో పూజారుల కోసం రామ్ మందిర్ తీర్థ క్షేత్ర ట్రస్ట్ అర్హత కలిగిన పూజారుల నుంచి కోరిన దరఖాస్తులకు ఊహించని స్పందన వచ్చింది. రాముడి సేవకు గాను 20 మంది పూజారులు కావలెనని పత్రికా ప్రకటన ఇవ్వగా దీనికోసం సుమారు 3 వేల మంది అభ్యర్థులు దీనికోసం దరఖాస్తు చేసుకున్నారని సంబంధిత అధికారులు తెలిపారు. వీరిలో ఇప్పటికే 200 మందిని షార్ట్ లిస్ట్ చేసినట్టు వారికి త్వరలోనే ముఖాముఖి (ఇంటర్వ్యూ) నిర్వహించనున్నట్టు ట్రస్ట్ సభ్యులు తెలిపారు.
షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) హెడ్ క్వార్టర్స్‌లోని కరసేవక్పురమ్లో ఇంటర్వ్యూ చేయనున్నారు. ప్రముఖ హిందూ మత బోధకుడు జయ్కాంత్ మిశ్రా, ఇద్దరు మహంత్‌లు మిథిలేష్ నందిని శరన్, సత్యనారాయణ దాస్లతో కూడిన కమిటీ ఈ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నది. 200 మందిలో ఎంపిక చేయబోయే 20 మంది పూజారులకు ఆరు నెలల పాటు ప్రత్యేకమైన శిక్షణ ఉండనుంది.
ఇంటర్వ్యూలో ఏం అడుగుతారు..?
త్వరలోనే నిర్వహించబోయే ఈ ఇంటర్వ్యూకు ఎంపిక కాబోయే 20 మంది అభ్యర్థలకు సంద్యా వందనం అంటే ఏమిటి..? రాముడిని పూజించేందుకు ఏ మంత్రాలను వాడతారు..? కర్మకాండలకు సంబంధించిన ప్రశ్నలు అడుగనున్నట్టు ట్రస్ట్ ట్రెజరర్ గోవింద్ దేవ్ గిరి తెలిపారు. ఇంటర్వ్యూలో నెగ్గిన వారికి ఆరు నెలల కాలంలో రూ. 2వేల స్టైఫండ్‌తో పాటు ఇతర వసతులు కల్పిస్తామని వివరించారు. ఇక షార్ట్‌లిస్ట్ చేసిన 200 మంది అభ్యర్థులలో ఇంటర్వ్యూకు రానివారు నిరాశ చెందాల్సిన పన్లేదు. వారికి భవిష్యత్‌లో మళ్లీ అవకావం దక్కొచ్చని ట్రస్ట్ తెలిపింది.