Operation Sindoor | న్యూఢిల్లీ : భారత్‌లోని 36 ప్రాంతాల్లో పాకిస్తాన్ 300 – 400 వరకు డ్రోన్లు ప్రయోగించిందని విదేశాంగ శాఖ కార్యదర్శి, రక్షణ శాఖ ప్రతినిధులు తెలిపారు. భారత గగనతల రక్షణ వ్యవస్థలను పరీక్షించడం, నిఘా సమాచార సేకరణే లక్ష్యంగా దాడులు జరిగాయని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ.. రక్షణ శాఖ ప్రతినిధులు కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కీలక వివరాలు వెల్లడించారు.
ప్రాథమిక నివేదికల ప్రకారం తుర్కియేకు చెందిన ఆసిస్‌గార్డ్ సోంగర్ అనే డ్రోన్లను ప్రయోగించినట్లు తెలిసింది. పాక్ నుంచి వచ్చిన డ్రోన్లను చాలా వరకు ధ్వంసం చేశాం. భటిండా సైనిక కేంద్రంపై దాడికి ప్రయత్నించారు. ప్రయాణికుల విమానాశ్రయాన్ని పాక్ సైనికులు రక్షణగా వాడుకున్నారు. మన సైనికుల మౌలిక వసతులు దెబ్బతీసేందుకు యత్నించారు. సరిహద్దు వెంబడి భారీస్థాయిలో కాల్పులకు దిగారు. పాక్ దాడులను మన రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాక్ వినియోగించే డ్రోన్ల ప్రయోగ కేంద్రాన్ని ధ్వంసం చేశాం. భారత బలగాల ప్రతి దాడుల్లో పాక్ భారీగా నష్టపోయింది. పాక్ తన పౌర విమానాశ్రయాలను ఇంకా మూసివేయలేదు. తమ దాడులకు భారత్ నుంచి ప్రతిస్పందన ఉంటుందని తెలిసీ పౌర విమానాలను రక్షణ కవచంగా పాకిస్తాన్ వాడుకుంటోంది. ఇది భారత్ – పాక్ మధ్య అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో వెళ్లే విమానాలతో పాటు అక్కడి పౌర విమానాలకు సురక్షితం కాదు. అంతర్జాతీయ విమానాలను దృష్టిలో ఉంచుకుని భారత వాయుసేన పూర్తి సంయమనంగా వ్యవహరించాలి అని పేర్కొన్నారు.
రాత్రి పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు దిగింది అని విక్రం మిస్రీ తెలిపారు. పలు నగరాలు లక్ష్యంగా డ్రోన్లతో దాడికి దిగింది పాకిస్తాన్. దాయాది దేశం దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాం. పూంఛ్‌లోని గురుద్వారాపై దాడి చేయడం దారుణం. ప్రార్థనా మందిరాలే లక్ష్యంగా పాకిస్తాన్ దాడులు చేస్తోంది. ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. భారత్ ప్రతి దాడులతో పాక్‌కు భారీ నష్టం జరిగింది. పాక్ సైనికుల కాల్పుల్లో ఇద్దరు పాఠశాల విద్యార్థులు మరణించారు. సరిహద్దుల్లో పాక్ సైన్యం ప్రయోగించిన క్షిపణి శకలాలు కనిపించాయి. కర్తార్‌పూర్ కారిడార్‌ను తాత్కాలికంగా మూసివేశామని వారు తెలిపారు.