గువాహతి: ఎడతెరపి లేకుండా గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఈశాన్య రాష్ర్టాలలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలు, ఆకస్మిక వరదలకు 30 మంది మరణించారు. గడచిన 24 గంటల్లో 14 మంది మరణించారు. అస్సాంలోని 12 జిల్లాలో దాదాపు 60,000 మంది వరద తాకిడికి బాధితులయ్యారు.
అస్సాంలో ఆకస్మిక వరదలకు ఐదుగురు మరణించగా, అరుణాచల్ ప్రదేశ్లో కొండ చరియలు విరిగిపడి 9 మంది మరణించారు. అరుణాల ప్రదేశ్లోని తూర్పు కమెంగ్జిల్లాలో కొండ చరియలు విరిగిపడడంతో ఓ కారు రోడ్డుపై నుంచి కొట్టుకుపోవడంతో రెండు కుటుంబాలకు చెందిన ఏడుగురు మరణించారు. ఈశాన్య భారతంలోని పలు రాష్ర్టాలకు వాతావరణ శాఖ ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
భారీ వర్షాలకు రహదారులపై కొండచరియలు విరిగిపడడంతో సిక్కింలోని వివిధ ప్రాంతాలలో దాదాపు 500 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. గల్లంతైన 8 మంది పర్యాటకుల కోసం జరుగుతున్న గాలింపు చర్యలకు వర్షం వల్ల ఆటంకం ఏర్పడింది.