Madhya Pradesh | భోపాల్, అక్టోబర్ 20: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చిన్నపార్టీలు కాంగ్రెస్, బీజేపీకి చెమటలు పట్టిస్తున్నాయి. పైకి ఈ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీ మధ్య ద్విముఖ పోరుగానే కనిపిస్తున్నప్పటికీ, చిన్నచిన్న పార్టీలు ఎక్కడ తమ కొంప ముంచుతాయోనని ఈ పార్టీలు భయపడుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 230 స్థానాలుండగా, దాదాపు 30 సీట్లలో చిన్నపార్టీల దెబ్బకు గతంలో కాంగ్రెస్, బీజేపీ అదృష్టాలు మారిపోయాయి. దీంతో జాతీయ పార్టీలు ఈసారి చాలా జాగ్రత్తగా ఎన్నికల మేనేజ్మెంట్కు పూనుకొన్నాయి.
2018 ఎన్నికల్లో రాష్ట్రంలోని దాదాపు 30 సీట్లలో గెలిచిన అభ్యర్థికి, ఓడిన అభ్యర్థి మధ్య ఓట్ల తేడా మూడు వేల లోపే ఉన్నది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లోనూ 33 సీట్లలో ఇదే పరిస్థితి కనిపించింది. ఈ స్థానాల్లో గెలిచిన అభ్యర్థి మార్జిన్.. అంటే ఓడిన అభ్యర్థికంటే సాధించిన ఎక్కువ ఓట్లకంటే మూడో స్థానంలో నిలిచిన అభ్యర్థి సాధించిన ఓట్లే అధికంగా ఉన్నాయి. గోండ్వానా గణపరిషత్ (జీజీపీ), బహుజన్ సంఘర్ష్ దళ్, బీఎస్పీ, సమాజ్‌వాదీ వంటి చిన్న పార్టీలు ఈ స్థానాల్లో ప్రధాన పార్టీల గెలుపు ఓటములను శాసిస్తున్నాయి.
2013 అసెంబ్లీ ఎన్నికల్లో 3 వేలలోపు ఓట్ల తేడాతో విజయం తేలిన 33 సీట్లలో బీజేపీ 18, కాంగ్రెస్ 12, బీఎస్పీ 2, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. ఇవే 33 సీట్లలో 2018 ఎన్నికల నాటికి పార్టీల గెలుపు ఓటములు తారుమారయ్యాయి.
విజయ్‌పూర్: గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థిపై 2,840 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. ఇక్కడ మూడోస్థానంలో నిలిచిన బీఎస్పీ ఏకంగా 35,238 ఓట్లు సాధించి కాంగ్రెస్ గెలుపు అవకాశాలకు గండి కొట్టింది.
గ్వాలియర్ సౌత్: ఇక్కడ కేవలం 121 ఓట్ల తేడాతో బీజేపీపై కాంగ్రెస్ గెలిచింది. బీజేపీ రెబల్ 30,745 ఓట్లు సాధించి ఆ పార్టీని చావుదెబ్బ కొట్టాడు. గెలుపు మార్జిన్కంటే నోటాకు అత్యధికంగా 1,550 ఓట్లు రావటం విశేషం.
మైహర్: కాంగ్రెస్‌పై బీజేపీ 2,984 ఓట్ల తేడాతో గెలిచింది. ఇక్కడ కాంగ్రెస్ అవకాశాలకు గండి కొడుతూ జీజీపీ ఏకంగా 33,397 ఓట్లు సాధించింది.
దేవ్తలాబ్: బీఎస్పీపై బీజేపీ 1,080 ఓట్ల తేడాతో గెలిచింది. సమాజ్‌వాదీ పార్టీ ఇక్కడ 2,213 ఓట్లు సాధించి బీఎస్పీ ఓటమికి కారణమైంది.
గ్వాలియర్ రూరల్: 2018 ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ అభ్యర్థి, బీఎస్పీపై 1,517 ఓట్ల తేడాతో గెలిచాడు. దళితుల్లో ప్రాబల్యం కలిగిన బహుజన్ సంఘర్ష్ దళ్ అనే పార్టీ 7,698 ఓట్లు, ఆమ్ఆద్మీ పార్టీ 2,689 ఓట్లు సాధించి బీఎస్పీ గెలుపును అడ్డుకొన్నాయి.
బినా (ఎస్సీ): బీజేపీ 460 ఓట్ల తేడాతో కాంగ్రెస్‌ను ఓడించింది. ఇక్కడ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా 1,563 ఓట్లు సాధించి గెలుపు ఓటములను శాసించింది.
టిమర్ని (ఎస్టీ): ఇక్కడ 2,213 ఓట్ల తేడాతో కాంగ్రెస్‌పై బీజేపీ గెలిచింది. జీజీపీ 4,722 ఓట్లు సాధించి కాంగ్రెస్ ఓటమికి కారణమైంది.
రాజ్పూర్ (ఎస్టీ): బీజేపీపై కాంగ్రెస్ అభ్యర్థి 932 ఓట్ల తేడాతో గెలిచారు. ఇక్కడ సీపీఐ 2,411 ఓట్లు, ఆప్ 1,510 ఓట్లు సాధించి బీజేపీ ఓటమికి కారణమయ్యాయి.