ముంబై, మే 3 (నమస్తే తెలంగాణ): మూడు సంవత్సరాల బాలుడు, మూడున్నరేండ్ల బాలికపై అత్యాచారం జరిపి, వారిద్దరిని హత్య చేసిన వేర్వేరు ఘటనలు బీజేపీ పాలిత మహారాష్ట్రలో సంచలనం సృష్టించాయి. మొదటి ఘటన పుణె జిల్లాలోని భోర్ తాలూకా నస్రాపూర్‌లో శుక్రవారం జరిగింది. సెలవులకు అమ్మమ్మ ఇంటికి వచ్చిన బాలికను ప్రలోభ పెట్టిన 65 ఏండ్ల వృద్ధుడు చిన్నారిపై లైంగిక దాడి చేశాడు.
తర్వాత ఆ విషయాన్ని బాధితురాలు ఎవరికైనా చెప్పొచ్చన్న భయంతో రాయితో తలపై మోది హత్య చేశాడు. దీంతో బెంగళూరు-ముంబై హైవేను వందలాది మంది దిగ్బంధించి ధర్నా చేశారు. అదే జిల్లాలోని దక్షిణ మహాలుంగేలో శుక్రవారం మరొక రేప్ జరిగింది. బాలుడి ఇంటి దగ్గర నివసించే బీహార్‌కు చెందిన మైనర్ చాక్లెట్ ఆశ చూపించి బాలుడిని తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. అక్కడ అతడిని రేప్ చేసి హత్య చేశాడు. సాక్ష్యాలను నాశనం చేసే ఉద్దేశంతో మృతదేహాన్ని ఒక సూట్ కేసులో పెట్టి తాళం వేశాడు.