లక్నో: మెట్రో స్టేషన్లో (Metro Station) తల్లిదండ్రులతో నిద్రిస్తున్న మూడేండ్ల చిన్నారిపై ఓ దుండగుడు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్లోని లక్నోలో చోటుచేసుకున్నది. బాధితురాలి తల్లిదండ్రులు రోజువారీ కూలీలుగా పనిచేస్తున్నారు. బుధవారం రాత్రి లక్నోలోని మెట్రో స్టేషన్ కింద నిద్రపోతున్నారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత తల్లిదండ్రుల మధ్య నిద్రిస్తున్న మూడేండ్ల చిన్నారిని ఓ దుండగుడు ఎత్తుకెళ్లాడు. ఆమెను నిర్మాణుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై లైంగికదాడి చేశాడు. అనంతరం అమెను అక్కడే వదిలేసి వెళ్లాడు.
చిన్నారి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు మెట్రో స్టేషన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతకగా.. నిర్మాణుష్య ప్రదేశంలో ఒంటరిగా ఉన్న ఆమెను గుర్తించారు. అనంతరం సమీపంలోని దవాఖానకు తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం మరో దవాఖానకు తీసుకెళ్లారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆశిష్ కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నదని తెలిపారు. నిందితుడిని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. సంబంధిత సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదుచేశామన్నారు.