Pune : మహారాష్ట్రలోని పూనేలో దారుణం జరిగింది. మూడేళ్ల బాలుడిపై మైనర్ హత్యాచారానికి పాల్పడ్డాడు. బాలుడిపై అత్యాచారం చేసిన అనంతరం నిందితుడు, చిన్నారిని చంపేశాడు. ఈ ఘటన మే 1,శుక్రవారం జరిగింది. పూనే పరిధిలో ఒకే రోజు జరిగిన రెండో చిన్నారి హత్యాచార ఘటన ఇది. బాలుడి హత్యాచారానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలివి. పూనేలో ఉంటున్న ఒక కుటుంబానికి చెందిన మూడేళ్ల బాలుడిని, శుక్రవారం వారి ఇంటికి దగ్గరలో ఉండే బిహార్‌కు చెందిన ఒక మైనర్ తీసుకెళ్లాడు.
చాక్లెట్లు ఇస్తానని చెప్పి నమ్మించి, బాలుడిని తను నివాసం ఉండే ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ బాలుడిపై మైనర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే, విషయం ఎవరికైనా తెలిస్తే ఇబ్బంది అవుతుందని చిన్నారిని పొడిచి చంపాడు. తర్వాత బాలుడి మృతదేహాన్ని ఒక సూట్‌కేసులో ఉంచి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తమ కొడుకు కనిపించకపోవడంతో బాలుడి తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. ఇదే సమయంలో నిందితుడి ఇంటికి కూడా వెళ్లి ఆరా తీశారు. కానీ, అతడు వారిని తప్పుదోవ పట్టించాడు. దీంతో తల్లిదండ్రులు అక్కడినుంచి వెతుక్కుంటూ వేరే చోటుకు వెళ్లిపోయారు. అయితే, ఎంత వెతికినా చిన్నారి బాలుడి ఆచూకీ కనిపించకపోవడంతో చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వారి మిస్సింగ్ కేసు నమోదు చేసి బాలుడి కోసం వెతికారు. చుట్టుపక్కల సీసీ కెమెరాలు పరిశీలించారు. ఈ క్రమంలో వారి ఇంటి సమీపంలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం సీసీ ఫుటేజ్ ఆధారంగా బిహార్‌కు చెందిన మైనర్ ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు గుర్తించారు. దీంతో నిందితుడి కోసం గాలించగా.. అతడు బిహార్ పారిపోయేందుకు ప్రయత్నిస్తూ రైల్వే స్టేషన్లో పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడిని విచారించగా, నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిపై పోక్సో సహా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం కూడా పూనే పరిధిలోనే నాలుగేళ్ల చిన్నారిని 65 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చేసి, చంపేశాడు.