Cloud Seeding | నవంబర్ వచ్చిందంటే చాలు ఢిల్లీ వాసులకు దడే. రాజధాని ప్రాంతంలో ఏటా అక్టోబర్ చివరి నుంచే వాయు కాలుష్యం (air pollution) గరిష్ఠ స్థాయికి చేరుతుంటుంది. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా రైతులు పంటల వ్యర్థాలు తగలబెట్టడానికి తోడు, చలికాలం కావడంతో దట్టమైన పొగ మంచు కారణంగా ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణిస్తుంది. ఈసారి కూడా దీపావళికి ముందే వాయు కాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరింది. దీంతో కాలుష్యం కట్టడికి రేఖా గుప్తా నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగానే దాదాపు 53 ఏండ్ల తర్వాత ఢిల్లీలో కాలుష్య స్థాయిలను పెంచేందుకు క్లౌడ్ సీడింగ్ నిర్వహించింది. దీని ద్వారా కృత్రిమ వర్షం కురిపించేందుకు ఏర్పాట్లు చేసింది. ఐఐటీ కాన్పూర్ (IIT Kanpur) సహకారంతో బురారి, ఉత్తర కరోల్ బాగ్, మయూర్ విహార్, బద్లి సహా పలు ప్రాంతాల్లో ట్రయల్స్ నిర్వహించింది. ఇందుకోసం రూ.కోట్లు ఖర్చుపెట్టింది. అయితే, ప్రభుత్వం చేసిన ఈ ప్రయత్నం విఫలమైంది. ప్రక్రియ పూర్తయినా వర్షం కురవలేదు.
వాయు కాలుష్యానికి తాత్కాలిక ఉపశమనంగా పనిచేసే ఈ ప్రక్రియ చాలా ఖర్చుతో కూడుకున్నది. ఈ ప్రయోగం కోసం ఢిల్లీ ప్రభుత్వం రూ.3.21 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. ఐఐటీ కాన్పూర్ సహకారంతో ఇప్పటికే మూడు ట్రయల్స్ కూడా నిర్వహించింది. అక్టోబర్ 23న ఒకటి, అక్టోబర్ 28న రెండు ట్రయల్స్ నిర్వహించింది. ఈ మూడు ట్రయల్స్‌కి దాదాపు రూ.1.07 ఖర్చైనట్లు తెలిసింది. ఈనెల 28న నిర్వహించిన రెండు ట్రయల్స్‌కు రూ.60లక్షలు వెచ్చించినట్లు సమాచారం. అయితే, రూ.కోట్లు కుమ్మరించినా ఒక్కటి కూడా ఫలితానివ్వలేదు. మూడు ట్రయల్స్ ఫెయిల్ అయ్యాయి.
ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్‌తో ఐఐటీ కాన్పూర్ తొమ్మిది ట్రయల్స్ నిర్వహించాలని భావించింది. అయితే, ఇప్పటికే నిర్వహించిన ట్రయల్స్ ఫెయిల్ అవ్వడంతో ఆ ప్రయత్నాన్ని ఢిల్లీ ప్రభుత్వం మధ్యలోనే ఆపేసింది. ఈ ప్రయోగం ఖర్చుతో కూడుకున్నదని ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ తెలిపారు. విమాన నిర్వహణ, పైలట్ ఫీజులు, ఇంధన ఖర్చులు వంటివి ఉంటాయని పేర్కొన్నారు. కాలుష్యం కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి అయ్యే ఖర్చు కొంచెం ఎక్కువే అని వెల్లడించారు. ఇక శీతాకాలం మొత్తం దేశ రాజధానిపై క్లౌడ్ సీడింగ్‌కు దాదాపు రూ.25 నుంచి రూ.30 కోట్ల వరకూ ఖర్చవుతుందని ఆయన అంచనా వేశారు.
ఏమిటీ కృత్రిమ వర్షం!
ఆకాశంలో కనిపించే ప్రతి నల్లమబ్బూ… కురవదు. ఊరించి వెళ్లేవే ఎక్కువ. మబ్బులలో ఉండే వర్షపు చుక్కలు తగినంత దట్టంగా లేకపోతే, అవి తేలిపోతాయి. మబ్బు భారమైనప్పుడే, అందులోని నీటి బిందువులు లేదా మంచుగడ్డలు నేల మీదకు జారతాయి. మబ్బులలో సాంద్రతను పెంచాలి అంటే… దూరదూరంగా ఉన్న నీటి బిందువులు దగ్గర కావాలి లేదా అవి ఘనీభవించి మంచుగా మారాలి. ఓ 130 ఏండ్ల క్రితమే.. మబ్బులను ఇలా ఏమార్చి, వర్షం కురిపించే ఆలోచనలు మొదలయ్యాయి. మబ్బుల్లోకి మట్టి, ఉప్పు, కార్బన్ డయాక్సైడ్.. ఆఖరికి టాల్కం పౌడర్ సహా రకరకాల పదార్థాలు చల్లి వాటిని కురిపించడంలో విఫలమయ్యారు.
దాదాపు యాభై ఏండ్ల తర్వాత కానీ ఈ పరిశోధనలు ఓ కొలిక్కి రాలేదు. 1946లో మొదటిసారిగా డ్రై ఐస్ ఉపయోగించి కృత్రిమ వర్షాన్ని కురిపించారు. అప్పటినుంచి అడపాదడపా, ఈ పద్ధతిని వాడుతూనే ఉన్నారు. కృత్రిమ వర్షాలను కురిపించడానికి అయ్యే ఖర్చు, కావాల్సిన సాంకేతికత చాలా ఎక్కువ. దాని ఫలితాల మీద ఇప్పటికీ కచ్చితమైన అంచనాలు లేవు. పైగా మబ్బులున్నంత మాత్రాన సరిపోదు. వాటి మీద ప్రయోగాలు చేసేందుకు మరికొన్ని అనువైన పరిస్థితులు కూడా ఉండాలి. అందుకే కృత్రిమ వర్షాల గురించి వార్తలు తక్కువే వినిపించేవి. కానీ, కాలం మారుతున్నది. కొత్త పద్ధతులు అందుబాటులోకి వస్తున్నాయి.
ఇదీ ప్రక్రియ!
నల్ల మబ్బుల్లోని నీటి బిందువులను ఘనీభవింపచేయడానికి సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్, ప్రొపేన్, డ్రై ఐస్ లాంటి పదార్థాలను వాడతారు. ఉప్పులాంటి కొన్ని పదార్థాలు చుట్టూ ఉన్న తేమను పీల్చుకునే శక్తిని కలిగి ఉంటాయి. వీటిని హైగ్రోస్కోపిక్ పదార్థాలు అంటారు. మబ్బుల్లోని బిందువులు దగ్గరకు వచ్చేందుకు ఇవి సాయపడతాయి. మేఘాలు ఎంత దట్టంగా ఉన్నాయి, ఎంత ఎత్తులో ఉన్నాయి, ఏ దిశగా ప్రయాణిస్తున్నాయి, వాటిలో నీటి శాతం ఎంత… లాంటి రకరకాల అంచనాల తర్వాత వాటిని నీరుగార్చే (క్లౌడ్ సీడింగ్) ప్రయత్నం మొదలవుతుంది. అందుకు అనుకూలమైన రసాయనాన్ని విమానాల ద్వారా వెదజల్లుతారు లేదా కింద నుంచి మేఘాల దిశగా వాటిని విసురుతారు. కృత్రిమ వర్షం కోసం ఇలా రసాయనాల వాడకంతోపాటు మబ్బులు వర్షాన్ని కురిపించేలా, వాటికి విద్యుద్ఘాతాన్ని కలిగించడం… లేజర్ కిరణాల ద్వారా వాటిని వర్షింపచేయడం లాంటి సాంకేతికతలు కూడా అందుబాటులోకి వచ్చాయి.
Also Read..
Air Pollution | ఢిల్లీలో క్షీణించిన వాయు కాలుష్యం.. వెరీ పూర్ కేటగిరీలో ఏక్యూఐ
Ayodhya Ram Temple | అయోధ్య రామాలయానికి రూ.3,000 కోట్ల విరాళాలు