న్యూఢిల్లీ, మార్చి 27: కృత్రిమ మేధ కారణంగా రాబోయే రోజుల్లో ఎన్నో రంగాల్లో ఉద్యోగాలు పోతాయని ప్రచారం జరుగుతున్న వేళ మూడు వృత్తులకు మాత్రం ఈ ఆటోమేషన్ ముప్పు తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్. ఏఐ తాకిడిని కోడింగ్, ఎనర్జీ మేనేజ్మెంట్, బయాలజీ రంగాలు తట్టుకుని నిలబడతాయని ఆయన చెప్పారు.
సమస్యలు పరిష్కరించే సామర్థ్యం, పరిస్థితులకు తగ్గట్టుగా సామర్థ్యాన్ని మెరుగుపర్చుకునే లక్షణాలను ఏఐ ఇంకా సొంతం చేసుకోలేకపోవడమే దీనికి కారణమని ఆయన విశ్లేషించారు. ఏఐతో కోడింగ్, ఇతర పనులు చేసినా, అనుకోకుండా వచ్చే సవాళ్లను పరిష్కరించాలంటే ప్రోగ్రామర్స్ అవసరం తప్పనిసరిగా ఉంటుందని ఆయన చెప్పారు. అలాగే ఎనర్జీ నిపుణులతో ఏఐ పోటీ పడలేదన్నారు.