భువనేశ్వర్: ముగ్గురు వ్యక్తులకు ఆంత్రాక్స్ (Anthrax) సోకింది. వైద్య పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆరోగ్య అధికారులు అలెర్ట్ అయ్యారు. ప్రభుత్వ హాస్పిటల్లో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ముగ్గురు వ్యక్తులు ఆంత్రాక్స్ బారినపడినట్లు ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు. మంగళవారం నుంచి గురువారం వరకు లక్ష్మీపూర్ బ్లాక్‌లో మూడు కేసులు నమోదయ్యాయని చెప్పారు. వైద్య పరీక్షల్లో ముగ్గురికి ఆంత్రాక్స్ ఇన్ఫెక్షన్ పాజిటివ్‌గా తేలిందని అన్నారు. వారిని హాస్పిటల్లో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.
కాగా, ఆంత్రాక్స్ సోకిన ఆవు కళేబరం నుంచి ముగ్గురు గ్రామస్తులకు అది సోకి ఉంటుందని అనుమానిస్తున్నట్లు కోరాపుట్ అదనపు జిల్లా వైద్యాధికారి సత్యసాయి స్వరూప్ తెలిపారు. ఆంత్రాక్స్ కేసులు నమోదైన కుటింగ గ్రామానికి ఆరోగ్య నిపుణుల బృందాన్ని పంపినట్లు చెప్పారు. ఆ గ్రామంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. ఆంత్రాక్స్ అనేది స్పోర్ ఫార్మింగ్ బాక్టీరియం బాసిల్లస్ ఆంత్రాసిస్ వల్ల కలిగే వ్యాధి అని వివరించారు.