కొత్తగూడెం ప్రగతి మైదాన్, సెప్టెంబర్ 28: ఛత్తీస్గఢ్లో మరోసారి తుపాకులు గర్జించాయి. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఆదివారం జరిగిన భీకరపోరులో ఓ మహిళ సహా ముగ్గురు మావోయిస్టులు నేలకొరిగారు. కాంకేర్ జిల్లా ఎస్పీ ఇంద్ర కల్యాణ్ కథనం ప్రకారం.. కాంకేర్ – గరియాబంద్ జిల్లాల సరిహద్దుల్లోని చింద్ఖడక్ గ్రామ సమీప అడవుల్లో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం మేరకు జిల్లా రిజర్వు గార్డ్ (డీఆర్జీ), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, రాష్ట్ర పోలీసు బలగాలు సంయుక్తంగా సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో వారికి మావోయిస్టులు తారసపడి కాల్పులు జరిపారు.
వెంటనే అప్రమత్తమైన జవాన్లు.. ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. ఘటనా స్థలం నుంచి మావోయిస్టుల మృతదేహాలతోపాటు ఒక ఎస్ఎల్ఆర్ రైఫిల్, ఒక 303 రైఫిల్, ఒక 12 బోర్ గన్, ఇతర వస్తు సామగ్రిని జవాన్లు స్వాధీనపరుచుకున్నారు. మృతుల్లో ఒక మహిళా మావోయిస్టు సైతం ఉంది. మృతులను గుర్తించినట్లు ఎస్పీ ఇంద్రకల్యాణ్ తెలిపారు. వారిలో సీతనాడి, రవాస్ ఏరియా కమిటీ కార్యదర్శి సర్వణ్ మడకం అలియాస్ విశ్వనాథ్, నగారి ఏరియా కమిటీ సభ్యుడు రాజేశ్ అలియాస్ రాఖేశ్ హేమ్లా, మేయిన్పూర్-నూవాపాడా ప్రొటెక్షన్ టీమ్ సభ్యురాలు బసంతి కుంజమ్ అలియాస్ హిద్మేగా గుర్తించినట్లు ఆయన వెల్లడించారు.