న్యూఢిల్లీ, జనవరి 16: దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు ద్విచక్ర వాహనాలు జీవనాడి. అయితే ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తూ మరణిస్తున్న వాహనదారుల సంఖ్య ఆందోళనకరంగా ఉంది. ప్రభుత్వం వెల్లడించిన డాటా ప్రకారం 2019-2023 మధ్య 3.35 లక్షల మంది ద్విక్ర వాహనదారులు మరణించారు. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా మొత్తం ప్రమాదాల్లో 7.78 లక్షల మంది మృతి చెందినట్టు ఈ డాటా వెల్లడించింది.
ఒక పక్క దేశ వ్యాప్తంగా ద్విచక్ర వాహనాల వాడకం పెరుగుతుండగా, ప్రమాద మృతుల సంఖ్య కూడా పెరుగుతున్నది. కాగా, కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ డాటా ప్రకారం 2023లో జరిగిన మొత్తం రోడ్డు ప్రమాద మృతులలో 45 శాతం మంది ద్విచక్ర వాహనదారులే ఉన్నారు. అలాగే ఢిల్లీలోని నేషనల్ కేపిటల్ రీజియన్లో కూడా మొత్తం మృతులలో 38 శాతం మంది ద్విచక్ర వాహనాలు నడుపుతున్నవారేనని లెక్కలు చెబుతున్నాయి.