న్యూఢిల్లీ, జూన్ 10: ఒమన్ తీరంలో వాణిజ్య నౌక సెట్టెబెల్లోపై బుధవారం అమెరికా జరిపినట్టుగా భావిస్తున్న దాడిలో ముగ్గురు భారత నావికులు గల్లంతు కాగా, 21 మందిని రక్షించారు. ఈ ఘటనను ఖండిస్తూ భారత్ ఒక ప్రకటన చేసింది. అలాగే అమెరికా రాయబారికి సమన్లు జారీ చేసింది. ఒమన్లోని భారత దౌత్య కార్యాలయం పరిస్థితిని సమీక్షిస్తున్నదని తెలిపింది. గల్లంతైన భారత నావికుల కోసం ఒమన్ నౌకా అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారని పేర్కొన్నది. ఆ ప్రాంతంలో ప్రయాణిస్తున్న నౌకలపై దాడులు జరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. పశ్చిమాసియాలో తిరిగి శాంతిని నెలకొల్పేందుకు వెంటనే కాల్పుల విరమణ పాటించాలని కోరింది.