Karnataka | బెంగళూరు, ఆగస్టు 10: చేసిన వాగ్దానాలు కొండంత.. అమలు చేసినవి కూసింత.. ఇదీ కాంగ్రెస్ పాలిత కర్ణాటకలోని దుస్థితి. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో ఆ పార్టీ కేవలం మూడు శాతం వాగ్దానాలు మాత్రమే పూర్తిగా అమలు చేసింది. సిటిజన్స్ సంస్థ శుక్రవారం విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. మొత్తం 59 వాగ్దానాల్లో కేవలం రెండింటిని మాత్రమే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం పూర్తిగా అమలు చేసిందని తెలిపింది.
ఆ నివేదిక ప్రకారం అత్యంత ప్రధానమైన ప్రజారోగ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఇచ్చిన ఆరు హామీల్లో ఒక్కటీ అమలుపర్చలేదు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది, వైద్యుల ఖాళీలను భర్తీ చేస్తామని, జాతీయ రహదారి వెంబడి ప్రతి 100 కి.మీకు ఒక ట్రామా సెంటర్‌ను ప్రతి రెవెన్యూ డివిజన్లో ఏర్పాటు చేస్తామని ఇచ్చిన వాగ్దానాల మాటే సిద్ధరామయ్య ప్రభుత్వం మరిచిపోయింది. విద్యారంగంలో ఇచ్చిన ఏడు హామీల్లో ఒక్కటి, ఉపాధి రంగంలో 15 వాగ్దానాల్లో ఒక్కటి నెరవేర్చగా, పర్యావరణంపై చేసిన ఒక్క హామీ పేపర్‌కే పరిమితమైంది. పారిశ్రామిక రంగంలో 11 వాగ్దానాల్లో రిక్తహస్తమే మిగిల్చింది. బెంగళూరు అభివృద్ధికి చేసిన ఐదు హామీలు గాలిలో కలిసిపోయాయి. మ్యానిఫెస్టో అమలుపై కాం గ్రెస్‌కు చిత్తశుద్ధి కరువైందని సివిక్ బెంగళూరు సభ్యురాలు కాత్యాయనీ విమర్శించారు.