భోపాల్: పెళ్లికి వెళ్లి గ్రామానికి తిరిగి వస్తున్న మహిళ, ముగ్గురు బాలికలను కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. వారి వెంట ఉన్న వ్యక్తిని బెదిరించి వెళ్లగొట్టారు. మహిళ, బాలికలను అడవిలోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. (3 Girls, Woman Raped) ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆరుగురు వ్యక్తులతో పాటు ఒక మైనర్ బాలుడ్ని అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 21 ఏళ్ల మహిళ, 15,16, 17 ఏళ్ల వయస్సున్న బాలికలు ఒక పెళ్లి వేడుకకు హాజరయ్యారు. శుక్రవారం రాత్రివేళ ఒక వ్యక్తితో కలిసి తమ గ్రామానికి తిరిగి వెళ్తున్నారు.
కాగా, బైక్‌లపై వచ్చిన ఆరుగురు మగవారు, ఒక బాలుడు కలిసి గిరిజనులైన ఆడవాళ్లను అడ్డుకున్నారు. వారి వెంట ఉన్న వ్యక్తిని భయపెళ్లి అక్కడి నుంచి వెళ్లగొట్టారు. మహిళ, ఆ బాలికలను అడవిలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించారు. బాధిత యువతులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితులైన ఆరుగురు వ్యక్తులు, ఒక మైనర్ బాలుడ్ని ఆరు గంటల్లో అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. బీఎన్ఎస్, పోక్సో చట్టం, ఎస్సీఎస్టీ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.