Air Show | చెన్నై, అక్టోబర్ 6: చెన్నైలో జరిగిన ఎయిర్ షోలో విషాదం చోటు చేసుకుంది. ప్రదర్శన చూడటానికి వచ్చిన పౌరుల్లో ముగ్గురు మరణించగా, 230 మంది దవాఖాన పాలయ్యారు. భారత వైమానిక దళం 92వ వార్షిక దినోత్సవ ఉత్సవాలను పురస్కరించుకుని చెన్నై మెరీనా బీచ్‌లో నిర్వహించిన ఈ ప్రదర్శనకు 15 లక్షల మంది హాజరయ్యారు. అయితే తీవ్ర ఎండ వేడికి తోడు, లక్షలాది మంది హాజరు కావడంతో పలువురు డీహైడ్రేషన్‌కు గురయ్యారు. మరణించిన వారిలో శ్రీనివాసన్ (48), కార్తికేయన్ (34), జాన్ (56) ఉన్నారు. ఈ ఎయిర్ షో ద్వారా లిమ్కా రికార్డు నెలకొల్పుతామని ప్రకటించిన నిర్వాహకులు దానికి తగిన ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారు.
పోలీసుల వైఫల్యం వల్ల నగరంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్‌జామ్‌లు ఏర్పడ్డాయి. కార్యక్రమం ముగిసిన తర్వాత అక్కడి నుంచి వెళ్లే క్రమంలో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రయాణికులతో రైల్వే స్టేషన్ కిక్కిరిసిపోయింది. చాలా మంది వృద్ధులు, మధ్య వయస్కులు ప్రదర్శన ప్రారంభం కాకముందే స్పృహతప్పి పడిపోవడం కన్పించింది. దీనికి తోడు మంచినీటిని అమ్మేవారిని అక్కడి నుంచి తొలగించడంతో ప్రజలు దాహంతో అల్లాడారు. తీవ్ర ఎండకు తాళలేక పలువురు రోడ్డు పక్కన కూలబడిపోవడం కన్పించింది. స్థానిక నివాసితులు వచ్చి వీరికి మంచినీరు అందించడంతో తేరుకున్నారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టిన నిర్వాహకులు కనీస ఏర్పాట్లు, అవసరాలను విస్మరించారని పలువురు మండిపడ్డారు.