న్యూఢిల్లీ: మూడు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. సోమవారం ఉదయం ఇందిరా గాంధీ స్టేడియం సమీపంలో మూడు బస్సులు ఢీకొన్నాయి. దీంతో ఒక స్కూల్ బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థుల్లో ఐదుగురు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సులోని మిగతా విద్యార్థులను వెనుక ఉన్న ఎమర్జెన్సీ విండో నుంచి బయటకు రప్పించారు.
కాగా, ఒక బస్సు బ్రేకులు ఫెయిల్ అయినట్లు పోలీసులు తెలిపారు. దీంతో బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ముందు ఉన్న బస్సును ఢీకొట్టగా, ఆ బస్సు మరో బస్సును ఢీకొన్నట్లు వెల్లడించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన స్కూల్ విద్యార్థులు చికిత్స పొందుతున్నారని, వారికి ప్రాణాపాయం లేదని చెప్పారు. మరోవైపు స్కూల్ బస్సు ప్రమాదం గురించి తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందారు.