MBBS Student | కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్‌లోని ఓ ప్రయివేటు మెడికల్ కాలేజీకి చెందిన ఎంబీబీఎస్ సెకండియర్ విద్యార్థినిపై ఓ ముగ్గురు యువకులు అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. అత్యాచారానికి పాల్పడ్డ ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. కానీ వారి వివరాలను పోలీసులు వెల్లడించలేదు.
ఒడిశాలోని జలేశ్వర్‌కు చెందిన 23 ఏండ్ల యువతి.. దుర్గాపూర్‌లోని ఐక్యూ సిటీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతుంది. అయితే శుక్రవారం రాత్రి తన స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లింది. మార్గమధ్యలో ఓ ముగ్గురు యువకులు వారిని వెంబడించారు. ఆ తర్వాత తన స్నేహితుడిని అమ్మాయిని బలవంతంగా లాక్కొని కిలోమీటర్ మేర తీసుకెళ్లారు. అనంతరం ఆమెపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న బాధితురాలిని అక్కడే వదిలేసి నిందితులు పారిపోయారు.
స్థానికులు బాధితురాలిని గమనించి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ అత్యాచార ఘటనలో తన కుమార్తె స్నేహితుడి పాత్ర కూడా ఉందని ఫిర్యాదు పేర్కొన్నారు తండ్రి. ఇక తమ బిడ్డ వద్ద ఉన్న ఫోన్‌తో పాటు రూ. 5 వేల నగదును నిందితులు దొంగిలించారని తెలిపారు.