Peon Jobs | జైపూర్, ఏప్రిల్ 21 : బీజేపీ పాలిత రాజస్థాన్‌లో 53,749 ప్యూన్ ఉద్యోగాల కోసం 24.76 లక్షల మందికి పైగా నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో పీహెచ్డీ, ఎంబీఏ, లా డిగ్రీలు ఉన్న వారితోపాటు సివిల్ సర్వీసెస్ కోసం తయారవుతున్న ఆశావహులు కూడా ఉండడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే ఒక్కో ఉద్యోగానికి 46 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు అర్థమవుతోంది. దరఖాస్తుదారులలో అత్యధికులు ఉన్నత విద్యావంతులే. జైపూర్‌లోని గోపాల్పురా ప్రాంతంలోగల కోచింగ్ సెంటర్ల వద్ద పలువురు అభ్యర్థులు ప్యూన్ పోస్టుల కోసం తాము ఎందుకు దరఖాస్తు చేయవలసి వచ్చిందో మీడియాకు వివరించారు.
2018 నుంచి తాను పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్నానని ఎంఏ, బీఈడీతో పాటు ఐటీ కోర్సులు చదివిన కమల్ కిషోర్ అనే అభ్యర్థి తెలిపాడు. ఇప్పటి వరకు తాను ఏ పరీక్షలో విజయం సాధించలేకపోయానని, ఏ ఉద్యోగం రాకపోతే నిరుద్యోగిగా మిగిలిపోవడం కన్నా ప్యూన్ ఉద్యోగం దొరకడం అదృష్టమేనని అతను వ్యాఖ్యానించాడు. సైన్స్‌లో పీజీ పూర్తి చేసిన తనూజా యాదవ్, ఎంఏ, బీఈడీ చదివిన సమిత్రా చౌదరి కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ పరీక్షల కోసం తయారవుతున్న వీరిద్దరూ ప్రభుత్వ కార్యాలయంలో నీళ్లు ఇచ్చే బంట్రోతు ఉద్యోగమైనా సరే సుస్థిరమైన ప్రభుత్వ ఉద్యోగంలో చేరే అవకాశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరాదని భావిస్తున్నారు.
లక్షల్లో దరఖాస్తులు రావడంతో ఆన్లైన్ దరఖాస్తుల వ్యవస్థ కూడా తట్టుకోలేకపోయింది. సైట్ పలుమార్లు క్రాష్ అయింది. రాజస్థాన్‌లో నిరుద్యోగ సమస్య తీవ్రతకు ఇది అద్దం పడుతున్నది. మరో ఉదాహరణ..ఫారెస్టు గార్డు పోస్టులకు వచ్చిన దరఖాస్తుల వెల్లువ. 2,399 పోస్టులకు 22 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్యూను పోస్టుకు కనీస విద్యార్హత 10వ తరగతి కాగా ఉన్నత విద్యావంతులు సైతం దరఖాస్తు చేసుకున్నారని రాజస్థాన్ స్టాఫ్ సెలెక్షన్ బోర్డు కార్యదర్శి బాధల్ ధ్రువీకరించారు. 3 లక్షల మందికి మాత్రమే ఒకే సమయంలో పరీక్ష నిర్వహించగల సామర్ధ్యం తమకు ఉందని, దరఖాస్తులను బట్టి చూస్తే 8 సార్లకు పైగా పరీక్ష నిర్వహించాల్సి వస్తుందని అన్నారు.